
పాలకొల్లు సెంట్రల్ : విపక్షాల ఓట్లు చీలకుండా చేయడం వల్ల జనసేన అభ్యర్థులను కొంతవరకూ గెలిపించుకునే అవకాశాలున్నా టీడీపీతో పొత్తు వల్ల పలు నష్టాలున్నాయని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీపై అవినీతి, కుల ముద్రతో పాటు ఆయనపై రంగా హత్య ఉదంతం రక్తపు మరకలు అలాగే ఉన్నాయన్నారు.
చంద్రబాబుకు వయోభారం, లోకేశ్‌కు అనుభవరాహిత్యం, ప్రధాని మోదీకి బద్ధ శత్రువుగా మిగలడం, కాపు రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లోపించడం, బీసీలకు జనాభా ప్రాతిపదికపైన రిజర్వేషన్ల డిమాండ్‌పై స్పందించకపోవడం లాంటి వాటివల్ల చివరకు జనసేనకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. జనసేన కనీసం 75 సీట్లలో పోటీ చేసి 50 సీట్లు కైవసం చేసుకుంటే గౌరవప్రదమైన అధికారాన్ని పొందవచ్చని జోగయ్య పేర్కొన్నారు.
చంద్రబాబుకు పూర్తి కాలం అధికారాన్ని అప్పగిస్తే పవన్‌పై వస్తున్న ప్యాకేజీ ఆరోపణలు నిజమేనని భావించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రాజకీయ విశ్లేషణ పేరుతో చేగొండి బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం లోపు మాత్రమే ఓట్లు రాగా జనసేనతో పొత్తు వల్ల రెండు శాతం పెరగవచ్చన్నారు. సీఎం జగన్‌ను ఓడించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే అని పేర్కొన్నారు. కేంద్రంతో సీఎం జగన్‌కు ఉన్న సత్సంబంధాలే దీనికి కారణమన్నారు.