ప్రజల పక్షాన పోరాడదాం
రైల్వే కోడూరు ఎమ్మెల్యే బాగోతం కనిపించదా?
● కష్టించే కార్యకర్తలకు పార్టీ అండదండలు
● గూడెం వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి
తాడేపల్లిగూడెం: పాలకుల లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల పక్షాన పోరాటం చేద్దామని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ జిల్లా అఽధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపు నిచ్చారు. పట్టణంలోని మాగంటి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన గూడెం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ ప్రజల్లో ఉంటూ పార్టీ పటిష్టం చేసుకోడానికి అందరూ సంసిద్ధులు కావాలన్నారు. ఏప్రిల్ నుంచి సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలన్నారు. అప్సడా వైస్ చైర్మన్‌గా, ఏపీ రైతు వర్కింగ్, ఆక్వా కల్చర్ ప్రెసిడెంటుగా వడ్డి రఘురాం పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించారని, ఆయన సేవలను గుర్తించి ఆయనను కన్వీనర్‌గా నియమించారన్నారు. రాబోయే ఎన్నికల్లో గూడెంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు, మహిళలు, విద్యార్ధులు మోసపోయారని, సామాన్యుడు నడిరోడ్డున పడ్డారన్నారు.
మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత మాట్లాడుతూ 18 నెలల్లో ఈ ప్రభుత్వం మూడు లక్షల కోట్లు అప్పుచేసిందన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు రూ.1500, నిరుద్యోగ యువతకు రూ.3000 ఎక్కడిచ్చారన్నారు. క్యాడర్‌ను కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యకర్తల వల్లే పార్టీ ఇంత బలంగా ఉందన్నారు. నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రావాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాధ్ మాట్లాడుతూ రచ్చబండ ద్వారా గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ పార్టీ శ్రేణులు ప్రభుత్వం మెడలు వంచేందుకు ఉద్యమాలు, పోరాటాలు చేయాలన్నారు. జోన్–2 మహిళా వర్కింగ్ ప్రెసిడెంటు చింతా అనూరాధ, కన్వీనర్లు పుప్పాల వాసుబాబు, పీవీఎల్ నరసింహరాజులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ.. చేసేది తక్కువన్నారు. గూడెం నియోజకవర్గంలో వర్గాలు లేవని, ఉన్నదే ఒకటే వర్గమని, అది వైఎస్సార్‌సీపీ వర్గమని కన్వీనర్ వడ్డి రఘురాం అన్నారు. పార్టీ బలోపేతంపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సలహాలు, సూచనలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో పెంటపాడు జెడ్పీటీసీ ఉప్పులూరి వరలక్ష్మి, గూడెం ఎంపీపీ పొనుకుమాటి శేషులత, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: మహిళలను లైంగికంగా వేధించే రైల్వే కోడూరు ఎమ్మెల్యే బాగోతాలు పాలకులకు కనిపిస్తున్నాయా? అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా ఉండి మహిళలతో డ్యాన్సులు చేస్తున్నారని, ఇది కూటమి నాయకుల నిర్వాకమని, ఇలాంటి వాళ్లను ప్రజలు క్షమించరన్నారు. చంద్రబాబు కలియుగ దైవం వెంకటేశ్వరుడిని సైతం తమ దొంగాటలోకి లాగారన్నారు. చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారం తప్పని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పునిచ్చి, తిరుపతి ప్రసాదంలో ఏం కల్తీ జరగలేదని స్పష్టం చేసిందన్నారు. ఈవీఎం మోసాలతో గెలిచిన చంద్రబాబు ప్రజలు కన్నెర్రచేస్తే కనుమరుగవుతారన్నారు.
ప్రజల పక్షాన పోరాడదాం
ప్రజల పక్షాన పోరాడదాం


