కలియుగ దైవంతో పెట్టుకున్నారు
● దైవంపై మీకు విశ్వాసం లేదని అర్థమైంది
● మాజీ మంత్రి కారుమూరి ధ్వజం
తణుకు అర్బన్: కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ రాజకీయంగా వాడుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ఏవిధంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలు లేవని సిట్ నివేదిక ఇవ్వడంతో వీరిద్దరూ తాము చేసింది తప్పని తిరుమల దేవస్థానంలో ముక్కును నేలకు రాసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారా? అని ప్రశ్నించారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అపవాదులు, అభాండాలు వేయాలనే సాక్షాత్తూ ఏడుకొండలవాడితోనే ఆట మొదలుపెట్టారని, సనాతన ధర్మం అంటూనే దేవుడిపై విశ్వాసం లేని విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
విజయవాడలో 300 గుళ్లు కూల్చారు
జగన్ హయాంలో గుళ్లు కట్టిస్తే చంద్రబాబు హయాంలో విజయవాడలో 300 గుళ్లు కూల్చారని కారుమూరి మండిపడ్డారు. ప్రభుత్వ ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇంకా జగన్ జపం తప్ప సంక్షేమం అందించే దిశగా కూటమి ప్రభుత్వం లేదని విమర్శించారు. దీపారాధనల్లోను, ప్రసాద స్వీకరణలోను కాలి బూట్లు కూడా తీయని మీరు సనాతన ధర్మమని చెప్పుకోవడం బాధాకరమన్నారు. పరిపాలన గాలికొదిలేశారని, మీ ఎమ్మెల్యేలకు పగ్గాలు వేసినా ఆగే పరిస్థితి లేకుండా దోపిడీకి పాల్పడుతున్నారని, మీ దోపిడీకి పేటెంట్ ఇచ్చారా అని నిలదీశారు. సనాతన ధర్మం అంటూనే గోవులను కూడా వధించేస్తున్నారని, బస్సులు వేసుకుని టీడీపీ, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాలకు తణుకు నుంచి జనం వచ్చినా పట్టించుకోలేదని దేవుడు మిమ్మల్ని క్షమించడని అన్నారు. మద్యం అమ్మకాల్లో పేదల రక్తమాంసాలు తింటున్నారని డబ్బు సంపాదనే లక్ష్యంగా దోపిడికీ దిగుతున్నారని ధ్వజమెత్తారు.


