లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు
భీమవరం(ప్రకాశం చౌక్): ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, సహకరించిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య శాఖ అధికారి జి.గీతాబాయి హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చాంబర్‌లో కమిటీ సలహ సంఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య శాఖ అధికారి జి.గీతాబాయి మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన, చేయడానికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేసి రిజిస్టర్లను క్షుణ్నంగా పరిశీలించాలన్నారు.
భీమవరం(ప్రకాశం చౌక్): అప్సడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్‌న్స్ హాలు నుంచి బుధవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి అప్సడా రిజిస్ట్రేషన్లపై మత్స్య శాఖ అధికారులు, ఎఫ్‌డీఓలు, ఎందీవోలతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 1,31,436 ఎకరాలలో ఆక్వాసాగు చేస్తున్నారని, ఇంతవరకు 66,340 ఎకరాల విస్తీర్ణంలో అప్సడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని, 39,413 ఎకరాలు అప్సడాలో రిజిస్టర్ కావలసి ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి నూరు శాతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆకివీడు: అనేక కారణాలతో తొలగించిన దివ్యాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్ర వృద్ధుల సంఘం సలహాదారుడు బొబ్బిలి బంగారయ్య డిమాండ్ చేశారు. మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ తల్లిదండ్రులకు భారమై ఇంట్లోనే అధిక శాతం అంగవైకల్యంతో ఉన్న వారికి ఇంటి కరెంట్ బిల్లు సాకుతో పింఛన్లు రద్దు చేయడం దారుణమన్నారు. మానవత్వం లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. దివ్యాంగుల పట్ల జాలి, కరుణ లేకుండా పింఛన్లు తొలగించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉచిత బస్సు పేరుతో సంపన్నులు కూడా ఆధార్‌కార్డుతో ప్రయాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న దివ్యాంగులు పడుతున్న బాధలు, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని మానవత్వంతో 50 శాతం పైగా దివ్యాంగత్వం ఉంటే పింఛన్లు మంజూరు చేయాలని బంగారయ్య విజ్ఞప్తి చేశారు.
పాలకోడేరు: రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాల్లో వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకుని, ఏవైనా తప్పులుంటే వెంటనే సరిచేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రు సచివాలయంలో రైతులతో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకంలో తప్పులు సరిచేసుకోవడంలో సూచనలు వివరించారు. ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసిల్దార్ ఎన్.విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: జిల్లాలో 8 బార్ల లైసెన్స్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి ఆర్‌వీ ప్రసాదరెడ్డి తెలిపారు. నరసాపురం 1, తణుకు 3, తాడేపల్లిగూడెంలో 4 బార్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి బార్‌కు 4 అప్లికేషన్లు వస్తేనే లాటరీ తీస్తామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 4 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.


