
సాక్షి,ఢిల్లీ: రాజకీయ దుమారం రేపిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా (rekha gupta) అధికారిక నివాసం రెన్నోవేషన్ (Home Renovation) కాంట్రాక్ట్ పనుల్ని నిలిపివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) ఢిల్లీ ప్రభుత్వానికి సమాచారం అందించింది. పునరుద్దరణ పనులను సైతం నిలిపివేసింది. ఇంటి రెన్నోవేషన్ కోసం టెండర్లకు ఆహ్వానించిన మూడు రోజుల తర్వాత పీడబ్ల్యూడీ విభాగం తాజా నిర్ణయం తీసుకుంది.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సివిల్ లైన్స్‌లోని రాజ్ నివాస్ మార్గంలో రెండు బంగ్లాను కేటాయించింది. వాటిల్లో బంగ్లా వన్‌లో రేఖా గుప్తా తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉండనున్నారు. బంగ్లా 2లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేఖా గుప్తా ఉండనున్న ఇంటికి అధికారులు పునరుద్ధరణ (Renovation) పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 లక్షలు ఖర్చు కానుంది.
అందులో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు, రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు, రూ.5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు రూ.2 లక్షలతో ఆ ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థ రూ.1.8 లక్షల విలువైన రిమోట్ కంట్రోల్‌తో కూడిన 23 సీలింగ్ ఫ్యాన్లు, రూ.85వేల విలువైన ఓటీజీ (ఓవెన్ టోస్ట్ గ్రిల్), రూ.77 వేల విలువైన ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, రూ.60 వేల విలువైన డిష్‌వాషర్, రూ.63 వేల విలువైన గ్యాస్ స్టవ్, రూ.32 వేల విలువైన మైక్రోవేవ్, రూ.91 వేల విలువైన ఆరు గీజర్‌లను ఆ ఇంట్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.6 లక్షల వ్యయంతో ఇంట్లో మొత్తం 115 లైట్లు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేసే పనుల్ని కాంట్రాక్ట్ ఇచ్చేందుకు పీడబ్ల్యూడీ విభాగం టెండర్లకు ఆహ్వానించింది.
అయితే, రేఖా గుప్తా నివాసం రెన్నోవేషన్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. శిష్ మహల్ (Sheesh Mahal) అంటూ కేజ్రీవాల్ నివాసంపై విమర్శలు చేసిన బీజేపీ ఇప్పుడు అదే రీతిలో ఖర్చు చేస్తుందా?’అంటూ ఆమ్ ఆద్మీ విమర్శలు గుప్పించింది. ప్రజలు నీటి కొరత, ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఏసీలు,టీవీలు కొనుగోలు చేయడంలో మునిగిపోయిందని కాంగ్రెస్ ద్వజమెత్తింది. ఈ క్రమంలో రేఖా గుప్తా ఇంటి రెన్నోవేషన్ పనుల్ని నిలిపివేస్తున్నట్లు పీడబ్ల్యూడీ విభాగం ప్రభుత్వానికి సమాచారం అందించడం కొసమెరుపు
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుంది. అనంతరం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు .ఈ నేపథ్యంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన దాదాపు 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు సివిల్ లైన్స్‌లోని రాజ్ నివాస్ మార్గంలో అధికారిక బంగ్లాను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ కేటాయించింది. ఆమె సొంత నియోజకవర్గానికి సమీపంలోనే నూతన బంగ్లాను కేటాయించింది. సీఎంకు 1/8, 2/8 నంబర్లతో కూడిన బంగ్లాలను కేటాయించారు.