
సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.
ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.