లోకేశ్‌కు బ్రెయిన్‌ లాస్‌

Gudivada Amarnath Fires On Nara Lokesh - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదనడం దారుణం

మీ తండ్రి షిప్‌యార్డ్‌ను, బీహెచ్‌ఈఎల్‌ని అమ్మేద్దామని చూస్తే వైఎస్సార్‌ కాపాడారు

ఉత్తరాంధ్రపై కక్షగట్టిన మీకు విశాఖ ఇప్పుడు గుర్తొచ్చిందా?

సాక్షి, విశాఖపట్నం: ఇటీవల వెయిట్‌ లాస్‌ కోసం చేసే ప్రక్రియలో నారా లోకేశ్‌కు బ్రెయిన్‌ లాస్‌ కూడా అయ్యిందేమోనన్న అనుమానం కలుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. విశాఖ స్టీల్‌ పరిశ్రమను ప్రైవేటీకరిస్తూ కేంద్రం ప్రకటించిన వెంటనే దానిని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాస్తే...ఇప్పటివరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదనడం దారుణమని పేర్కొన్నారు. విశాఖని కార్యనిర్వాహక రాజధానిగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటిస్తే, దాన్ని వ్యతిరేకించి విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలపై కక్షగట్టిన లోకేశ్‌కు ఇప్పుడు విశాఖ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. ఆదివారం మద్దిలపాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ను ఉద్దేశించి ఆయనేమన్నారంటే..

అప్పుడు సమర్థించి ఇప్పుడు నీతులా?
‘రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా మీ తండ్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే అంశాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్న విషయం మీకు తెలియదా..? 2014 జూలై 14న జాతీయ పత్రికలు, పలు మీడియా సంస్థలు దీనిపై కోడై కూశాయి. అప్పుడు కేంద్రంలో బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మీ తండ్రి అడ్డుకుని, విశాఖ స్టీల్‌కు సొంత గనులు కేటాయింపజేసి ఉంటే నష్టాలు వచ్చేవా? అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించి.. ఇప్పుడు నీవు, నీతండ్రి నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. 2018లో సౌత్‌ కొరియా వెళ్లి పోస్కో సంస్థల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నది నిజం కాదా? విశాఖ స్టీల్‌ పరిశ్రమ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. దాన్ని అమ్మేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదనే కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడిన వైఎస్సార్‌
విశాఖలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడిన ఘనత దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుంది. అప్పుడు మీ తండ్రి షిప్‌యార్డ్‌ను, బీహెచ్‌ఈఎల్‌ని ప్రైవేట్‌ సంస్థలకు అమ్మేద్దామని ప్రయత్నాలు చేస్తే.. వాటిని కాపాడిన ఘనత వైఎస్సార్‌ది కాదా? మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకార సంస్థలు, చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి.  హిందుస్తాన్‌ జింక్‌ని ప్రైవేటీకరణ చేసింది కూడా మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే...’ అని అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. 

ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేసింది చంద్రబాబే
విశాఖకు వెళ్లి అబద్ధాలు మాత్రమే చెప్పాలని కొడుకుకి చంద్రబాబు చెప్పి పంపినట్లుగా ఉందని అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేయడంతో పాటు, రాష్ట్ర విభజన చేయమని లేఖ రాసిందే చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడూ కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందీ, ప్రత్యేకహోదా వద్దని ప్యాకేజీ తీసుకున్నది కూడా ఆయనేనని గుర్తుచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ గన్‌ నుంచి బుల్లెట్‌లు రావడం లేదని, నీళ్లు మాత్రమే వస్తున్నాయని లోకేశ్‌ అంటున్నారని, కానీ తమ సీఎం దెబ్బకి టీడీపీ తమ్ముళ్ల కళ్లల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయని అమర్‌నాథ్‌ చెప్పారు. దీనికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే నిదర్శనమన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top