మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్ర

Guard against BJP bid to trigger communal row - Sakshi

బీజేపీపై మమతా బెనర్జీ ఆరోపణలు

ముస్లింలు బీజేపీ ట్రాప్‌లో పడవద్దని పిలుపు

కోల్‌కతా: ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతాబెనర్జీ ఆరోపించారు. 24 పరగణ జిల్లాలో శనివారం ఆమె పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ముస్లిం ఓట్లను చీల్చే బీజేపీ కుట్రలో పావులుగా మారొద్దని రాష్ట్రంలోని ముస్లింలకు మమత పిలుపునిచ్చారు. ‘బీజేపీ మద్దతుతో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒక పార్టీ, బెంగాల్‌లో ఆ పార్టీ మిత్రపక్షమైన మరో పార్టీ ముస్లిం ఓట్లను చీల్చాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి కుయుక్తులను తిప్పికొట్టండి’ అని ఆమె పిలుపునిచ్చారు. అసదుద్దీన్‌ ఓవైసీకి చెందిన ఎంఐఎం, అబ్బాస్‌ సిద్ధిఖీల ఐఎస్‌ఎఫ్‌లను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో మమత చేసిన ఇదే తరహా వ్యాఖ్యలను ఎంఐఎం, ఐఎస్‌ఎఫ్‌ ఇప్పటికే తోసిపుచ్చాయి. ఐఎస్‌ఎఫ్‌ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తోంది. మతం పేరుతో బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని హిందువులను కూడా మమత కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, రాష్ట్రంలో ప్రశాంతతను దెబ్బతీయాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. మీ ప్రాంతాల్లో బయటివారు కనిపిస్తే వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తాను హిందుత్వాన్ని విశ్వసించే వ్యక్తినని మమత మరోసారి గుర్తు చేశారు. దళితుల ఇళ్లల్లో ఆ భోజనం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటు న్నారని, అయితే ఆ భోజనాన్ని ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల నుంచి తెప్పించుకుంటు న్నారని బీజేపీ నేతలపై ఆమె మండిపడ్డారు. తాను బ్రాహ్మణ మహిళను అని, అయితే, తనకు అన్ని సమయాల్లో సహాయకారిగా ఉండి, వంట చేసి పెట్టేది ఒక ఎస్సీ మహిళ అని వివరించారు.

వీడియోపై వివాదం
మమత వీల్‌ చెయిర్‌లో కూర్చుని గాయమైన తన కాలును పైకి, కిందకు కదిలిస్తున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. సానుభూతి ద్వారా ఓట్లు పొందాలని మమత ఈ డ్రామాలు చేస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని టీఎంసీ బదులిచ్చింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top