‘బాబు అవమానిస్తే.. సీఎం జగన్‌ అక్కున చేర్చుకున్నారు’ | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు

Published Wed, Feb 28 2024 2:06 PM

Gollapalli Surya Rao Left TDP Joined YSRCP presence of CM Jagan - Sakshi

గుంటూరు, సాక్షి: తెలుగు దేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. పార్టీని వీడిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు.. వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో సూర్యారావు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అయితే.. టీడీపీలో నిబద్ధతతో పని చేసిన తనని మెడబట్టుకుని గెంటేశారని మీడియా ముందు సూర్యారావు వాపోయారు. 

‘‘నిబద్ధతతో పని చేసిన నన్ను టీడీపీ దారుణంగా అవమానించింది.  చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఉంటే ఉండు.. పోతే పో అన్నట్లు చూశారు. అధికారం కోసం చంద్రబాబు మౌన మునిగా మారారు. లోకేష్‌ దుర్మార్గపు రీతిలో ఆ పార్టీని నడిపిస్తున్నాడు. 


సూర్యారావుకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుతున్న సీఎం జగన్‌

ఆ బాధలో ఉన్న నన్ను సీఎం జగన్‌ అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు నన్ను మెడపట్టుకుని బయటకు గెంటారు. జగన్‌ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ కోసం శాయశక్తుల పని చేస్తా.. ’’అని సూర్యారావు చెప్పారు. మాజీ మంత్రి సూర్యారావుతో పాటు పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్‌ బాబు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌.. ఎంపీ మిథున్‌రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు.


వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం మీడియాతో గొల్లపల్లి

అంతకు ముందు.. చంద్రబాబుకు రాజీనామాతో పాటు ఓ బహిరంగ లేఖ రాశారాయన. పొత్తులో భాగంగా.. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామాకు కారణంగా వెల్లడించారు గొల్లపల్లి. ఆ వెంటనే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లిన ఆయన్ని ఎంపీలు మిథున్‌రెడ్డి, కేశినేని నానిలు వెంటపెట్టుకుని సీఎం జగన్‌ చెంతకు తీసుకెళ్లారు.

గొల్లపల్లి 2004లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైఎస్ కేబినెట్‌లో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో రాజోలు నుంచి గెలిచారు. అయితే 2019లో రాపాక వరప్రసాద్‌ చేతిలో ఓడారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement