గోవా పీఠంపై మళ్లీ బీజేపీ!

Goa Results: BJP Wins 20 Of 40 Seats Set To Form Government - Sakshi

20 సీట్లతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా కమల దళం 

సాధారణ మెజారిటీకి ఒక స్థానం తక్కువ

12 సీట్లతో రెండో స్థానంలో కాంగ్రెస్‌ కూటమి 

తృణమూల్‌ కూటమికి మూడు.. ఆప్‌నకు రెండు స్థానాలు  

బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమైన ఎంజీపీ, స్వతంత్రులు 

చిన్న రాష్ట్రం గోవాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మరీ అధికార బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 40 సీట్లకు గాను 20 సీట్లు గెలుచుకుంది. శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్‌ ఫిగర్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. జీఎఫ్‌పీతో కూడిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూటమి 12 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి 2, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కూటమికి 3 సీట్లు వచ్చాయి.

తృణమూల్‌ కూటమిలో ఉన్న ఎంజీపీ రెండు సీట్లు సాధించింది. ముగ్గురు స్వతంత్రులు నెగ్గారు. ఎంజీపీకి చెందిన ఇద్దరు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో బీజేపీ బలం 25కు చేరింది. గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం ఇక లాంఛనమే. ఎంజీపీ తమకు బేషరతుగా మద్దతునిచ్చేందుకు అంగీకరించిందని ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు బీజేపీ గోవా ఎన్నికల ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. ప్రభుత్వ నూతన సారథి ఎవరన్నది పార్టీ నాయకత్వమే నిర్ధారిస్తుందని ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. కొత్త ప్రభుత్వంపై మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ)కి ప్రాతినిధ్యం కల్పించాలా, లేదా ఇంకా నిర్ణయించలేదని వెల్లడించారు.

శుక్రవారం జరగబోయే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో దానిపై స్పష్టత వస్తుందన్నారు. గోవా ఎన్నికల్లో ఓటమిపై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గిరీష్‌ చోడాంకర్‌ స్పందించారు. నాన్‌–బీజేపీ ఓట్లు చీలిపోవడం వల్లే కమలం పార్టీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 33.31 శాతం, కాంగ్రెస్‌ 23.46 శాతం ఓట్లు సాధించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్‌ పాలేకర్‌ ఓటమి చెందడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top