ఊహించిందే జరిగింది; ఎన్నిక లేదు.. ఏకగ్రీవమే!

GHMC Standing Committee Members 2021: 8 TRS And 7 MIM Nominees Unanimously Elected - Sakshi

టీఆర్‌ఎస్‌కు 8 మంది, ఎంఐఎంకు ఏడుగురు

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు

అధికార పార్టీ నుంచి ముగ్గురి ఉపసంహరణ

టీఆర్‌ఎస్‌– ఎంఐఎం భాగస్వామ్య ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: ఊహించినట్లే జరిగింది. అధికార టీఆర్‌ఎస్‌.. దాని మిత్రపక్ష ఎంఐఎం ఒప్పందంలో భాగంగా రెండు పార్టీల నుంచి 15 మంది జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. మొత్తం 15 మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు టీఆర్‌ఎస్‌ నుంచి 11 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపంహరణలకు చివరిరోజైన సోమవారం టీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గు రు ఉపసంహరించుకోవడంతో, పోటీలో మిగిలిన 15 మంది ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రకటించారు. 

► జీహెచ్‌ఎంసీలో 47 మంది కార్పొరేటర్లతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, టీఆర్‌ఎస్‌– ఎంఐఎంలకు కలిపి ఉమ్మడిగా వంద మంది కార్పొరేటర్లు ఉండటంతో, ఎలాగూ గెలవలేమని తెలిసి బీజేపీ బరిలోనే దిగలేదు.

► గత పాలకమండలిలో సైతం టీఆర్‌ఎస్‌– ఎంఐఎంల పొత్తు ఒప్పందానికనుగుణంగా మొత్తం 15 మంది స్టాండింగ్‌  కమిటీ సభ్యులు ఆ రెండు పార్టీల వారే ఉన్నారు.

► అప్పట్లో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు 99 మంది, ఎంఐఎం కార్పొరేటర్లు 44 మంది ఉండటంతో టీఆర్‌ఎస్‌నుంచి 9 మందికి, ఎంఐఎం నుంచి ఆరుగురికి స్టాండింగ్‌ కమిటీలో స్థానం కల్పించా రు. ఈసారి  టీఆర్‌ఎస్‌ బలం 56 మాత్రమే ఉండటంతో, ఒకడుగు వెనక్కు తగ్గి ఎనిమిది మంది స్టాండింగ్‌ కమిటీ సభ్యులతో సరిపెట్టుకుంది.

► ఆ మేరకు ఎంఐఎంకు ఒక స్థానం అదనంగా లభించింది. ఎంఐఎంకు గత పాలకమండలిలో, ఇప్పుడు కూడా 44 మంది కార్పొరేటర్ల బలం ఉండటం విశేషం. ఒప్పందానికనుగుణంగా టీఆర్‌ఎస్‌ నుంచి 8 మంది,ఎంఐఎంనుంచి ఏడుగురు స్టాండింగ్‌ కమిటీ సభ్యులయ్యారు.  

► ఊహించినట్లుగానే పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో టీఆర్‌ఎస్‌ నుంచి  నామినేషన్లు వేసిన వారిలో జగదీశ్వర్‌గౌడ్, రాగం నాగేందర్‌ యాదవ్, వనం సంగీతయాదవ్‌లు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.   

స్టాండింగ్‌ కమిటీ ఏం చేస్తుంది?

► స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా వీరి పదవీకాలం ఒక సంవత్సరం.  

► జీహెచ్‌ఎంసీలో రూ. 2 కోట్ల  నుంచి రూ. 3  కోట్ల  మేర విలువైన పనులకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తప్పనిసరి.

► సాధారణంగా  స్టాండింగ్‌ కమిటీ వారానికోసారి సమావేశమవుతుంది. అందుకు  వారంలో ఏదో ఒక రోజును ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ. గత పాలకమండలిలో  ప్రతి గురువారం నిర్వహించేవారు.

► కొత్త స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఎన్నికైనప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో దాదాపు నెలరోజుల పాటు వీరు ఏ  పనులకూ ఆమోదం తెలిపేందుకు అవకాశం ఉండదని సంబంధిత అధికారి తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top