ఓట్ల కోసమే షోలు: ఉత్తమ్‌

GHMC Elections 2020: Modi Hyderabad Visit A Drama Says Uttam Kumar - Sakshi

బీజేపీపై ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపాటు

గ్రేటర్‌ వరదల్లో వంద మంది చనిపోతే రాని అమిత్‌షా ఓట్ల కోసం వస్తారా?

ప్రధాని హైదరాబాద్‌ రాకపోతే కరోనా వ్యాక్సిన్‌ తయారీ ఆగిపోతుందా?

కేసీఆర్‌ పతనానికి ఈ ఎన్నికలే నాంది: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్‌ ప్రజలను అవమానపరిచే విధంగా వ్యవహరించిందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చి వంద మంది చనిపోతే కనీసం పరామర్శకు రాని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా... ఓట్ల కోసం వచ్చి షోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.  వ్యాక్సిన్‌ పరిశీలన పేరుతో మోదీ హైదరాబాద్‌కు రావడం కూడా డ్రామాయేనని దుయ్యబట్టారు. మోదీ రాకపోతే కరోనా వ్యాక్సిన్‌ తయారీ ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి జె. గీతారెడ్డి తదితరులతో కలసి ఉత్తమ్‌ మాట్లాడారు. 

కేవలం ఒకే ఒక్క కార్పొరేషన్‌ ఎన్నికల కోసం బీజేపీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం అవసరమా? అని ఉత్తమప్రశ్నించారు. సొంత రాష్ట్రంలో దళితులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నివారించలేని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌... హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారానికి రావడం విడ్డూరంగా ఉందన్నారు. తాము గెలిస్తే హైదరాబాద్‌ పేరు మారుస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారని, వారి పేర్లు మార్చుకున్నంత సులువుగా నగరాల పేర్లు మారవని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని చెప్పడానికి బీజేపీ నేతలకు బుద్ధి ఉండాలని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం చేసిందని నిలదీశారు.

కేసీఆర్‌ అడ్డగోలుగా దోచుకుతిన్నారు...
గత ఏడేళ్లలో సీఎం కేసీఆర్, ఆయన పార్టీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలే కేసీఆర్‌ పతనానికి నాంది పలుకుతాయని ఉత్తమ్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్‌ఫ్లాప్‌ అయిందని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఒకే తాను ముక్కలని, ఆ పార్టీలను మూసీలో పడేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఏ అభివృద్ధి జరిగినా కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని గ్రేటర్‌ ప్రజలు గమనించాలని కోరారు. భవిష్యత్తులో నగరం మరింత అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఉత్తమ్‌ కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top