
హైదరాబాద్: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలముందు సూపర్ సిక్స్ అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ఈరోజు(శుక్రవారం) సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన హర్షకుమార్.. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల ఊసేలేదని విమర్శించారు.
‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు , తల్లికి వందనం లేదు. పెన్షన్ పెంపు లేదు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఏపీలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. అమరావతి , పోలవరం అంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు పొగడ్డలకే సరిపోయింది. తిరుపతిలో తలపెట్టిన మాలల సభను చంద్రబాబు అడ్డుకున్నారు. ఏపీలో పాశవిక పాలన సాగుతోంది. మాలలను, మాదిగలను వేరు చేసి రాజకీయాలకు వాడుకుంటున్నారు. మాలల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఓటమి రుచి చూపించారు. ప్రజల్లో పూర్తీ వ్యతిరేఖతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోంది’ అని మండిపడ్డారు.
