Sakshi News home page

వీఐపీల డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు

Published Sun, Feb 25 2024 4:48 AM

Fitness tests for VIP drivers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు.

ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు.

ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్‌ శనివారం గాం«దీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది 
మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు.

ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. 

బీఆర్‌ఎస్, బీజేపీలది డ్రామా 
బీఆర్‌ఎస్‌– బీజేపీ ఒకటేనని.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్‌ఎస్‌–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

బిహార్‌ మోడల్‌లో కులగణన 
త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్‌లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్‌కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలు చూపాలని సవాల్‌ చేశారు.

ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్‌లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్‌ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement