
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దళితులు, గిరిజనులను వేధించిన వారికి బీజేపీ ఉన్నత పదవులు ఇస్తుందనే దానికి తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకమే ఉదాహరణ అంటూ భట్టి విమర్శలు చేశారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణం. ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవితో రివార్డు ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకాన్ని పునరాలోచన చేయాలి. రోహిత్ వేముల ఆత్మహత్యకి కారణమైన సుశీల్ కుమార్‌కి ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారు. ఇది వ్యవస్థాగత హత్య. ఏబీవీపీ నాయకులతో కలిసొచ్చి రామచందర్ రావు ధర్నా చేశారు.
ఢిల్లీ నుంచి రామచందర్ రావు పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి రోహిత్ వేములను డిస్మిస్ చేయించారు. దేశ ద్రోహం కేసులు పెట్టించారు. ఈ వేధింపులకు వ్యతిరేకంగా రోహిత్ వేముల చట్టం తీసుకురావాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. రోహిత్ వేముల కేసును రీ ఓపెన్ చేస్తున్నాం. కోర్టు అనుమతి కోసం అభ్యర్థన పెట్టాం. దోషులకు తగిన శిక్షలు పడాలి. ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి ఉండాలి. వివక్ష ఉండకూడదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ మాట్లాడుతూ..‘రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ రివార్డులు ఇస్తోంది. రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది. బీజేపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను పక్షపాతంతో ఫెయిల్ చేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు.