అంతేనా లోకేష్‌.. టీడీపీ నేతల ప్రాణాలకు విలువే లేదా!

Discussion In TDP On Nara Lokesh Attitude - Sakshi

కార్యకర్తలంటే అసలు లెక్కే లేదా?

వాళ్లు చనిపోతే పరామర్శకు కాదు కదా.. కనీసం సానుభూతి ప్రకటన కూడా లేదాయె..

డాక్టర్‌ సుధాకర్‌ మృతి చెందితే మాత్రం హడావుడి 

పరామర్శ కోసం ఆఘమేఘాల మీద వచ్చేందుకు ఏర్పాట్లు

‘దేశం’ నేతలకు సాయమూ లేదు.. పలకరింపూ లేదు..

ఇదేనా టీడీపీ కుటుంబసభ్యుల మీద ప్రేమ

ఆ పార్టీ  శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ 

సనపల పాండు రంగారావు... టీడీపీ  అధికార ప్రతినిధి, పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్నారు... విశాఖ నగరంలో పార్టీ సీనియర్‌ నేతలు మొదలు కార్యకర్తల వరకు పాండు పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. బీసీ వర్గానికి చెందిన పాండు ఈ మధ్యనే కరోనాతో కన్నుమూశారు.

ఇమంది రమణ... ఈయన కూడా పార్టీ అధికార ప్రతినిధే.. సీనియర్‌ నాయకుడు.. పార్టీ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 25వ వార్డు నుంచి కార్పొరేటర్‌ అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయారు. బీసీ వర్గానికే చెందిన ఈయన కూడా ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు.

కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్‌.. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 31 వార్డు నుంచి టీడీపీ కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2007లో కూడా కార్పొరేటర్‌గా పనిచేశారు. సీనియర్‌ నాయకుడు, సమాజసేవకుడిగా నగరంలో ఎంతో గుర్తింపు పొందారు. వెనుకబడిన వర్గాలకు చెందిన ఈయన కూడా ఈ మధ్యనే మృతి చెందారు.

కామాకుల నాగేశ్వరరావు.. టీడీపీకి ఎన్నో ఏళ్లు సేవలందించారు.. ఇటీవల జీవీఎంసీ ఎన్నికల్లో 52వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి పరాజయం పొందారు. బీసీ వర్గాలకు చెందిన ఈయన కూడా ఇటీవల అకాల మరణం పొందారు.

ఇక మాజీ ఎంపీ, మాజీ మేయర్‌ సబ్బం హరి గురించి చెప్పేదేముంది. రెండేళ్ల కిందట టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయిన దరిమిలా... పాలకపక్షంపై అలుపెరుగకుండా విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే కరోనాతో చనిపోయారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇలా టీడీపీ నేతలు ఈమధ్య కాలంలో చాలామంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఇక కార్యకర్తలయితే లెక్కే లేదు. ఇలా ఎంతమంది చనిపోయినా... హైదరాబాద్‌ గడప దాటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబు... వివాదాస్పద డాక్టర్‌ సుధాకర్‌ మృతి చెందితే మాత్రం పరామర్శ కోసం హడావుడిగా బయలుదేరడం ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే చర్చకు తెరలేపింది. పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్దాలుగా సేవలందించిన నేతలు, కార్యకర్తలు చనిపోతే లోకేష్‌ నుంచి కనీసంగా ఫోన్‌లో కూడా పరామర్శ, సానుభూతి ఎరుగని టీడీపీ శ్రేణులకు.. ఇప్పుడు ఆయన డాక్టర్‌ సుధాకర్‌ ఇంటికి పరామర్శ కోసం ఆదుర్దాపడటం మింగుడు పడటం లేదు. 

నేను టీడీపీ వాడిని కాదని సుధాకర్‌ స్వయంగా మొత్తుకున్నా... 
2020 ఏప్రిల్‌ తొలినాళ్లలో నర్సీపట్నంలో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య మాస్కులు లేవంటూ ప్రభుత్వంపై సుధాకర్‌ అకారణంగా అనవసర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత సుధాకర్‌ విశాఖ నగరంలో నడిరోడ్డుపై మద్యం మత్తులో సీఎం, పీఎంలను దూషించి నానాయాగీ చేశారు. దీంతో మానసిక వైద్యశాలకు తరలించి.. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. మద్యం మత్తులో సుధాకర్‌ విమర్శల ఎపిసోడ్‌ను తలకెత్తుకున్న టీడీపీ నేతలు నానా హంగామా సృష్టించారు. సుధాకర్‌ని అడ్డుపెట్టుకుని పబ్లిసిటీ కోసం ఎన్నో కుయుక్తులు పన్నారు.

చివరికి కేసు సీబీఐకి వెళ్లడంతో ఎవరికి వారు సర్దుకున్నారు. అయితే అప్పటికే డాక్టర్‌ సుధాకర్‌కు జరగాల్సిన నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుధాకర్‌ గతేడాది జూన్‌లో మీడియా ముందుకు వచ్చి... ‘నేను తప్పు చేశాను.. నా పై కుట్ర జరిగింది.. నన్ను అనవసరంగా ఇరికించారు.. నేను టీడీపీ వాడిని కాదు.. సీఎం గారు దేవుడు.. జగన్‌ గారూ నన్ను క్షమించండి..’  అని వేడుకున్నారు. తనకు టీడీపీకి సంబంధం లేదని సుధాకర్‌ మొత్తుకున్న దృశ్యాలను అప్పట్లో టీడీపీ అనుకూల చానెళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే తనకు, టీడీపీకి సంబంధం లేదని చెప్పుకున్న డాక్టర్‌ సుధాకర్‌ ఇంటికి పరుగులు తీస్తున్న లోకేష్‌ బాబు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేసిన కార్పొరేటర్లు, సీనియర్‌ నేతలకు కనీస నివాళి కూడా అర్పించకపోవడమే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. 

టీడీపీ నేతల కంటే ఆయనే ఎక్కువా?
డాక్టర్‌ సుధాకర్‌ మృతి చెందిన దరిమిలా ఏకంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా నివాళులర్పించారు. ఆయన ఫొటోకి పూలదండలు వేసి మరీ శ్రద్ధాంజలి ఘటించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో కూడా దర్శనమిచ్చాయి. సుధాకర్‌కి నివాళులర్పించడంలో టీడీపీ శ్రేణులకు వచ్చిన అభ్యంతరాలేమీ లేవు కానీ కనీసం ఆయన పాటి అర్హత కూడా విశాఖ టీడీపీ నేతలకు లేదా అన్న ప్రశ్నలు మాత్రం తెరమీదకు వచ్చాయి. సుధాకర్‌కున్న విలువ కూడా పార్టీలో తమకు లేదా అని పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

నేడు నారా లోకేష్‌ రాక.. కేవలం సుధాకర్‌ ఇంటికే పరిమితం 
మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సోమవారం విశాఖ రానున్నారు. ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ వస్తున్నట్టు ఆ పార్టీ విశాఖపట్నం పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సీతమ్మధార నార్త్‌ ఎక్షటెన్షన్‌æలో ఇటీవల మరణించిన డాక్టర్‌ సుధాకర్‌ ఇంటికి చేరుకుంటారు. ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు అక్కడ ఉంటారు. డాక్టర్‌ సుధాకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తిరిగి విమానంలో హైదారాబాద్‌ వెళతారని తెలిపారు. ఆదివారం జరగాల్సిన లోకేష్‌ పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top