
నంద్యాల జిల్లా: టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించిన భజనకీర్తనలే చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదంటూ సీపీఎం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మధు విమర్శించారు. ఈరోజు(గురువారం) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘ టీడీపీ మహానాడు మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించామని భజన కీర్తనలకే పరిమితమైంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడులకు లొంగిపోయి.. పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పజెప్పకుండా, ఏ విషయం తేలకుండా మిగిలిపోయిన ఆపరేషన్ సిందూర్ ను మహానాడు వేదికగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ ను, ఎన్టీఆర్ ను పొగిడినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు పెట్టుకుని ప్రజలను మోసం చేసే చర్యలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణ సమయంలో గతంలో నరేంద్ర మోదీ చెంబెడు నీళ్లు, మట్టి తెచ్చారు.ఈసారి అది కూడా తేలేదు. ప్రత్యేక హోదా లేదు. విభజన హామీలు లేవు. రూ. 1500 కోట్ల నిధులు లేవు. అలాగే వాగ్దానాలు నెరవేర్చలేదు.
రాజధాని పేరుతో కార్పొరేట్ రాజధాని చేస్తున్నారు తప్ప.. ప్రజల రాజధాని కాదు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మోదీని విమర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు మారిపోయింది. పవన్ ది నాలుక లేక తాటిమట్ట నాకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు.. ఇప్పుడు చంద్రబాబు చేతులెత్తేశారు.
కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లొంగుబాటు రాష్ట్రానికి తీరని లోటు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితిని గాలికి వదిలేసి 12 రోజుల్లో కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నామని చంద్రబాబు చెప్పడం ఏంటి?, టీడీపీ మహానాడు వైఫల్యాల పుట్ట. మహానాడులో ఇరగదీసింది ఏమీలేదు. మహానాడు ప్రజలపై భారం మోపేందుకు , పచ్చి అవకాశవాదంగా మార్చుకునేందుకు పెట్టారే తప్ప మహానాడుతో ఒరిగేదేమీ లేదు. అవకాశవాదంతో రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కొనసాగడం సాధ్యం కాదు’ అని హెచ్చరించారు.