breaking news
Penumalli Madhu
-
‘అప్పుడు చెంబెడు నీళ్లు.. మట్టి తెచ్చారు..ఈసారి అదీ లేదు’
నంద్యాల జిల్లా: టీడీపీ నిర్వహించిన మహానాడులో ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించిన భజనకీర్తనలే చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదంటూ సీపీఎం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు మధు విమర్శించారు. ఈరోజు(గురువారం) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘ టీడీపీ మహానాడు మోదీ హయాంలో పాకిస్తాన్ పై విజయం సాధించామని భజన కీర్తనలకే పరిమితమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడులకు లొంగిపోయి.. పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పజెప్పకుండా, ఏ విషయం తేలకుండా మిగిలిపోయిన ఆపరేషన్ సిందూర్ ను మహానాడు వేదికగా పొగుడుతున్నారు. చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ ను, ఎన్టీఆర్ ను పొగిడినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియోలు పెట్టుకుని ప్రజలను మోసం చేసే చర్యలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణ సమయంలో గతంలో నరేంద్ర మోదీ చెంబెడు నీళ్లు, మట్టి తెచ్చారు.ఈసారి అది కూడా తేలేదు. ప్రత్యేక హోదా లేదు. విభజన హామీలు లేవు. రూ. 1500 కోట్ల నిధులు లేవు. అలాగే వాగ్దానాలు నెరవేర్చలేదు.రాజధాని పేరుతో కార్పొరేట్ రాజధాని చేస్తున్నారు తప్ప.. ప్రజల రాజధాని కాదు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మోదీని విమర్శించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు మారిపోయింది. పవన్ ది నాలుక లేక తాటిమట్ట నాకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు.. ఇప్పుడు చంద్రబాబు చేతులెత్తేశారు. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లొంగుబాటు రాష్ట్రానికి తీరని లోటు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితిని గాలికి వదిలేసి 12 రోజుల్లో కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నామని చంద్రబాబు చెప్పడం ఏంటి?, టీడీపీ మహానాడు వైఫల్యాల పుట్ట. మహానాడులో ఇరగదీసింది ఏమీలేదు. మహానాడు ప్రజలపై భారం మోపేందుకు , పచ్చి అవకాశవాదంగా మార్చుకునేందుకు పెట్టారే తప్ప మహానాడుతో ఒరిగేదేమీ లేదు. అవకాశవాదంతో రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కొనసాగడం సాధ్యం కాదు’ అని హెచ్చరించారు. -
‘బాబు, లోకేశ్‌లకు తెలిసే జరిగింది..’
సాక్షి, విజయవాడ: ఆదాయపన్ను శాఖ దాడుల్లో వెలుగు చూసిన రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు తెలిసే అవినీతి జరిగిందని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా జరుగుతన్న ఐటీ దాడులను బట్టి ఈ విషయం స్పష్టమైందన్నారు. చంద్రబాబు హయాంలో పెద్ద కుంభకోణం జరిగిందని, నేరస్తుల మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత మాజీ కార్యదర్శి నివాసంలో సోదాలు చేస్తేనే రెండు వేల కోట్ల బయటపడితే.. చంద్రబాబు, లోకేశ్‌లపై దాడులు చేస్తే ఎన్ని వేల కోట్లు బైటపడతాయోనని ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు మీదనే కాదు టీడీపీ నాయకులు మీద కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. (చంద్రబాబును తక్షణం అరెస్టు చేయాలి: వైఎస్సార్సీపీ) 2 లక్షల కోట్లకు పైమాటే: ఎమ్మెల్సీ సునీత టీడీపీ బినామి సంస్థలు లక్షల కోట్లు కాజేశాయని ఎమ్మెల్సీ పోతుల సునీత ఆరోపించారు. ఒంగోలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండు వేల కోట్లు కాదు రెండు లక్షల కోట్లకు పైగానే చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. రాజధాని అమరావతి పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు కాజేసి, భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని మండిపడ్డారు. (చదవండి: చంద్రబాబు అవినీతి బట్టబయలు) -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీపీఎం నేతలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ఏపీ సీపీఎం నేతలు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, గఫుర్, వైవీలు ఉన్నారు. తమపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీపీఎం నేతలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు, అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరినట్టు నేతలు తెలిపారు. విద్యుత్ రంగాల్లో యూనియన్ల గురించి ముఖ్యమంత్రితో మాట్లాడమని చెప్పారు. తాము చెప్పిన అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని సీపీఎం నేతలు పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన కేజీవీబీ ఉపాధ్యాయుల సంఘం ఆంధ్రప్రదేశ్ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు సోమవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. 352 పాఠశాలల్లో 2600 మంది ఉపాధ్యాయులు కాంట్రాక్టు పద్ధతిలో 14 ఏళ్లుగా పనిచేస్తున్నట్టు వారు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి అలవెన్సు లేకుండా, తక్కువ జీతానికి తాము పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయులు సంఘం ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. -
సిపిఎం రెండు శాఖల ఏర్పాటు: ఏపికి మధు, తెలంగాణకు తమ్మినేని
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రెండు రాష్ట్రాలకు రెండు శాఖలను ఏర్పాటు చేసింది. రెండు కమిటీలకు కార్యదర్శులను నియమించింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా సీనియర్ నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రంను నియమించారు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కార్యదర్శిగా పార్టీ కేంద్ర కమిటి సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు పెనుమల్లి మధును నియమించారు. వీరిద్దరూ విద్యార్థి దశ నుంచే పార్టీ తరపున వివిధ ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం శనివారం జరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, సీతారం ఏచూరీ, కేంద్ర కమిటీ సభ్యుడు వి.శ్రీనివాసరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే రెండు రాష్ట్రాలకు కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు కమిటీలు నియమించిన మొట్టమొదటి పార్టీ సీపీఎం. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల కమిటీలకు కూడా సభ్యులను నియమించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేత రాఘవులు చెప్పారు. పొత్తులపై రెండు రాష్ట్ర కమిటీలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయని ఆయన చెప్పారు.