సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ భరత్ భూ దోపిడీపై విశాఖ జిల్లా సీపీఎం కార్యదర్శి జగ్గు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ భరత్ భూదోపిడిని అరికట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వేల కోట్ల భూములు దోచుకోవడానికా మీకు ప్రజలు ఓట్లు వేసింది? అని ప్రశ్నించారు.
విశాఖ జిల్లా సీపీఎం కార్యదర్శి జగ్గు నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎంపీ భరత్ కబ్జా చేశారు. భూమి విలువ సుమారు 5000 కోట్లు ఉంటుంది. ఎంపీ భరత్ భూ దోపిడిని అరికట్టాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టరాదు. ఎన్నికలకు ముందు విశాఖలో భూములను కాపాడుకుంటామని కూటమి పార్టీలు చెప్పాయి. వేల కోట్ల భూములు దోచుకోవడానికా మీకు ప్రజలు ఓట్లు వేసింది. పేదవాడికి 60 గజాలు భూమి ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెట్టారు. ఎంపీ భరత్‌కు ఎలా ఇస్తున్నారు’ అని ప్రశ్నించారు.
కాగా, విశాఖలో అత్యంత విలువైన రుషికొండ ప్రాంతంలో తన బంధుగణం కబ్జా చేసి ఆక్రమించిన విలువైన ప్రభుత్వ భూమిని దోచిపెట్టేందుకు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తన బావమరిది అయిన బాలకృష్ణ చిన్న అల్లుడు, తన తనయుడు నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాలకు పాల్పడి ఆక్రమించుకున్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కానుకగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు జీవీఎంసీ వేదికగా కుట్రలకు తెర తీశారు. ఈ భూ సంతర్పణకు జీవీఎంసీ చివరి పాలక వర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసేందుకు అజెండాలో 15వ అంశంగా చేర్చారు. ఎకరం రూ.100 కోట్లు చొప్పున రూ.5 వేల కోట్లకు పైగా విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించారు.


