
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్ల ఎలా కడతారు? అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారాయన.
శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల అనేది ప్రస్తుత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదు. మొదట పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు. కాంట్రాక్టర్లు,రాష్ట్రం ,కేంద్రం కలిసి ప్రాజెక్టు కడతామని చెప్పారు. బనక చర్ల రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు కాదు రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది.
అసలు.. చంద్రబాబు బనకచర్ల గురించి మొదట తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడాల్సింది. అలా చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ప్రాజెక్టులు ఎప్పుడైనా వివాద రహితంగా కట్టుకోవాలి. నదుల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్ళాలి. అంతేగానీ నీళ్ళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం.. తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడంతో సమానమే. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నీళ్లను అడ్డుకోవద్దు అని నారాయణ హితవు పలికారు.
రేవంత్ గట్టొడు
టీఆర్‌ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తరువాత సెంటిమెంట్ ఎగిరిపోయింది. ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. ప్రతి అంశంపై సెంటిమెంట్లతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రేవంత్ తెలంగాణ సీఎం. ఆయన ఎన్నుకోబడిన నేత.. నామినేట్ చేయబడిన వ్యక్తి కాదు. తెలంగాణకి రేవంత్ అన్యాయం చేయలేదు. పొట్టివాడు గట్టి వాడు. అయితే.. రేవంత్ విమర్శిస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలి అని నారాయణ సూచించారు.