అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ  | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ 

Published Wed, Dec 27 2023 4:38 AM

CPI enters into assembly - Sakshi

అసెంబ్లీలోకి సీపీఐ ఎమ్మెల్యే అడుగిడగా, శాసనసభ ఎన్నికల్లో సీపీఎంకు మాత్రం పరాభావమే మిగిలింది. సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేసి ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. ఎంతో ప్రతిష్ట కలిగిన సీపీఎంకు గత అసెంబ్లీలోనూ, ప్రస్తుత అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం దక్కలేదు.  

పొత్తుల్లో సీపీఐ సక్సెస్‌ 
బీఆర్‌ఎస్‌తో పొత్తు విఫలం కావడంతో సీపీఐ కాంగ్రెస్‌కు దగ్గరమైంది. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు కాగా, సీపీఎంతో పొత్తు కుదరలేదు. చివరకు సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగగా, సీపీఐ కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది.

ఆ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి వామపక్షాలు కలిసి పనిచేయాలని ఎన్నికలకు ముందే నిర్ణయించుకున్నాయి. కానీ పొత్తుల విషయంలో పొసగక ఎవరిదారి వారు చూసుకున్నారు. ఎన్నికల దృష్టితో చూస్తే సీపీఐ వ్యూహం ఫలించదని అంటున్నారు. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓట్లను నిలబెట్టుకోలేకపోయిందన్న ఆరోపణలు వచ్చాయి.  

సీపీఎంకు ఘోర పరాభవం...
తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం ఎక్కడా తన ప్రభావం చూపలేకపోయింది. భద్రాచలం మినహా ఇతరచోట్ల గెలుపోటటములను నిర్దేశించలేకపోయింది. సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లో 15 చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించగా, మిగిలిన నాలుగు చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. అంతేకాదు అన్ని స్థానాల్లోనూ సీపీఎం డిపాజిట్లు పొందకపోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు.

ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు నియోజకవర్గంలోనూ సత్తా చాటలేకపోయారు. ఆయనకు కేవలం 5,308 ఓట్లు మాత్రమే వచ్చాయి. భద్రాచలం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి 5,860 ఓట్లు సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అక్కడ 5,719 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌ గెలుపునకు సీపీఎం అడ్డుపడినట్టుగా హస్తం వర్గాలు అంటున్నాయి. 19 చోట్ల పోటీ చేస్తే సీపీఎంకు వచి్చన మొత్తం ఓట్లు కేవలం 52,349 మాత్రమే కావడం గమనార్హం.   

Advertisement
 
Advertisement
 
Advertisement