బీజేపీతోనే అవినీతి రహిత పాలన  | Corruption free governance with BJP says amith shah | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అవినీతి రహిత పాలన 

Nov 26 2023 4:44 AM | Updated on Nov 26 2023 4:44 AM

Corruption free governance with BJP says amith shah - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/చౌటుప్పల్‌/పటాన్‌చెరు/బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): రాష్ట్రంలో బీజేపీతోనే అవినీతి రహిత పాలన అందుతుందని.. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కారు పదేళ్ల పాలనలో భారీగా అవినీతికి పా ల్పడిందని ఆరోపించారు.

తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని, 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులలో నిర్వహించిన సక ల జనుల విజయ సంకల్ప సభల్లో, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్వహించిన రోడ్‌ షోలలో అమిత్‌ షా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘బీఅర్‌ఎస్‌ సర్కారు నిరుద్యోగులను మోసం చేసింది. కేసీఆర్‌ హయాంలో 14కుపైగా ఉద్యోగ పరీక్షల పేపర్లు లీకయ్యాయి. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. బీజేపీ ప్రభుత్వం వస్తే పేపర్‌ లీకేజీలపై విచారణ జరిపి దోషులను జైలుకు పంపుతాం. అంతేకాదు 2.5 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తాం. కేసీఆర్‌కు ఇక్కడి యువతపై ప్రేమ లేదు. కానీ ఒక్క యువకుడు.. కేటీఆర్‌ను సీఎం చేయడంపైనే ఆయన ధ్యాస అంతా ఉంది.

బీఆర్‌ఎస్‌ అంటే భ్రష్టాచార్‌ రాక్షస సమితి. చాలా ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడింది. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చేతిలో ఉంది. ఎంఐఎంకు భయపడి కేసీఆర్‌ హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. బీజేపీ ప్రభుత్వం వస్తే.. తెలంగాణకు ఎంఐఎం చేతిలోంచి విముక్తి కల్పిస్తాం. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకే.. 
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయొద్దు. వాళ్లకు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారు. కాంగ్రెస్‌ ఇప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి రేపటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అవుతారు. అదే బీజేపీకి ఓట్లు వేస్తే బీఆర్‌ఎస్‌కు బదులు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది.

రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు తావులేని పాలన అందిస్తాం. ఉజ్వల లబ్దిదారులకు ఏటా నాలుగు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. వాల్మీకి, బో య, మాదాసి కురువలను కేసీఆర్‌ విస్మరించారు. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి బీసీయే. మా ప్రభు త్వం రాగానే వాల్మీకి, బోయ, మాదాసి కురువలకు న్యాయం చేస్తాం. ఎస్సీ వర్గీకరణను త్వరలో పూర్తి చేస్తాం. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గిస్తాం. 

యూరప్‌ మార్కెట్‌కు కొల్లాపూర్‌ మామిడి 
కొల్లాపూర్‌  మామిడి  రైతులను  కేసీఆర్‌  ప్రభుత్వం పట్టించుకోలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసి.. కొల్లాపూర్‌ మామిడిని యూరప్‌ మార్కెట్‌కు తీసుకెళ్తాం.  

అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తాం 
కాంగ్రెస్‌ పార్టీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడ్డు తగిలింది. అదే ప్రధాని మోదీ రామమందిర నిర్మాణం చేపట్టారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఇక్కడి ప్రజలకు విడతల వారీగా ఉచితంగా రామమందిర దర్శనం కల్పిస్తాం..’’ అని అమిత్‌ షా తెలిపారు. 

రాహుల్‌యాన్‌.. 20 సార్లు ఫెయిల్‌ 
మోదీ ప్రభుత్వం చంద్రయాన్‌తో చంద్రుడిపై జాతీయ జెండాను రెపరెపలాడించింది. కానీ కాంగ్రెస్‌ పార్టీ పదేపదే రాహుల్‌యాన్‌ లాంచ్‌ చేయాలని చూస్తోంది. 20 ఏళ్ల నుంచి 20సార్లు రాహుల్‌ యాన్‌ను ప్రవేశపెడితే అన్నీ ఫెయిల్‌ అయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement