పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? : సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments at Mahbubnagar meeting | Sakshi
Sakshi News home page

పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? : సీఎం రేవంత్‌

Jan 18 2026 3:40 AM | Updated on Jan 18 2026 3:40 AM

CM Revanth Reddy Comments at Mahbubnagar meeting

అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోయి మమ్మల్ని ప్రశ్నిస్తారా?

మహబూబ్‌నగర్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నన్ను దిగిపో దిగిపో అంటున్నారు..  

సీఎం కుర్చీ ఏమైనా మీ జాగీరా? మీ తాతలు ఇచ్చిన ఆస్తినా? 

ఇంకా పదేళ్లు మేమే ఉంటాం 

రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘ప్రజా సమస్యలు, ప్రాజెక్టులపై శాసనసభ వేదికగా చర్చించాలని సవాల్‌ విసిరా. రోజంతా చర్చ పెట్టినా ప్రతిపక్ష నాయకుడు రాకుండా పారిపోయారు. నిజంగా వారు తెలంగాణకు ప్రాజెక్టులు తెచ్చి ఉంటే.. సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తే ఎందుకు పారిపోయారు? చర్చకు రాకుండా పారిపోయి మళ్లీ మమ్మల్ని ప్రశ్నిస్తారా? మీరు పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం మహ బూబ్‌నగర్‌కు వచ్చిన ఆయన రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టిన ట్రిపుల్‌ ఐటీ భవన నిర్మాణాలు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పునరుద్ధరణ, బలోపేతం వంటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. 

ఎలా పాలించాలో మాకు తెలుసు 
‘నేను సీఎం అయి రెండేళ్లు కాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నన్ను దిగిపో దిగిపో అంటున్నారు. సీఎం కుర్చీ ఏమైనా మీ జాగీరా? మీ తాతలు ఇచ్చిన ఆస్తినా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టారు. పాలన ఎలా చేయాలో.. సమస్యలు ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు. ఇంకా పదేళ్లు మేమే ఉంటాం. నచ్చితే ఆశీర్వదించు. నచ్చకపోతే నీ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకో. శుక్రాచార్యులు, మారీచులు, సుబాహులు, రాక్షసులను కట్టడిచేసే సత్తా పాలమూరు బిడ్డకు ఉంది.  

గొప్పలు చెబుతున్న ప్రతిపక్షం 
ప్రతిపక్షంలో ఉన్నవారు మేము విజయాలు సాధించామని గొప్పలు చెబుతున్నారు. కానీ తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు అయినా మంజూరు చేసిండా? లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూళేశ్వరం అయింది. డిండి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండ, పాలమూరు–రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో అప్పటి పాలమూరు ఎంపీ విఠల్‌రావు పాలమూరు పథకం గురించి నాటి సీఎం దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి విజ్ఞప్తి చేశారు. 

ఆయన అకాల మరణం తర్వాత దీంతో పాటు జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఆగిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ పథకానికి రూ.25 వేల కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించి, ఉద్ధండాపూర్‌ నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదు? కల్వకుర్తి ప్రాజెక్టు భూసేకరణకు ఎందుకు నిధులు ఇవ్వలేదు? బీమా–1లో భాగంగా సంగంబండ రిజర్వాయర్‌ కాల్వకు అడ్డుగా బండ ఉంటే.. దాన్ని తొలగించేందుకు రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదు. నేను సీఎం అయిన తర్వాత వీటికి నిధులు మంజూరు చేశా. జూరాల వద్ద నూతన బ్రిడ్జి కావాలని అడిగితే రూ.123 కోట్లు మంజూరు చేశాం. కేసీఆర్‌ ఈ పనులు ఎందుకు చేయలేదు?..’ అని ముఖ్యమంత్రి నిలదీశారు.
 
ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష? 
‘మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ పథకం ఆషామాషీగా రాలేదు. అప్పటి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి.. అప్పటి సీఎం వైఎస్సార్‌తో మాట్లాడి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని, ఎత్తిపోతలు అవసరమని, బీమా ఎక్స్‌టెన్షన్‌ ప్రాజెక్టు కింద నిధులు ఇవ్వాలని కోరారు. కానీ వారి అకాల మరణంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. నేను కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలిచాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వెంటపడటంతో రూ.1,500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరి జీఓ 69 జారీ చేశారు. కానీ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది. ఈ ప్రాంతంపై ఎందుకు వివక్ష చూపించారు? గత ప్రభుత్వంలో సీఎంను కలిసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అడిగేందుకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ధైర్యం చేయలేదు. మీరు ఇప్పుడు వచ్చి.. మేము పనులు చేస్తుంటే తప్పు పడుతుండడం మీ చేతగానితనం..’ అని రేవంత్‌ అన్నారు.  

రూ.20 లక్షల కోట్ల లెక్కలేవి? 
‘కేసీఆర్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో ఖర్చు చేసిన రూ.20 లక్షల కోట్ల వివరాలు చెప్పలేదు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న మీరు ఈ రూ.20 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారనేది ఎందుకు చెప్పడం లేదు?   

పాలమూరులో ఐఐఎం! 
రేవంత్‌రెడ్డి పదేపదే ప్రధాని మోదీని కలుస్తున్నారని నేనంటే గిట్టనివాళ్లు కొందరు అంటున్నారు. తెలంగాణకు నిధులు, అనుమతులు సాధించుకునేందుకు ప్రధానిని కలిస్తే తప్పేంటి. హైదరాబాద్‌ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు మొదటి సీఎం కాగా.. 75 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు రెండోసారి రాష్ట్రానికి సీఎంగా అయ్యే అవకాశం దక్కింది. ఇక్కడి ఎంపీ డీకే అరుణతో కలిసి మోదీని కలుస్తాం. తెలంగాణకు ఐఐఎం ఇవ్వమని అడుగుతా. దీన్ని పాలమూరులో ప్రారంభించుకుందాం. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవు. ఉచితంగా ఏమి ఇచ్చినా అది శాశ్వతం కాదు. విద్య ఒక్కటే శాశ్వతం. విజ్ఞానం ఉంటేనే రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలగలిగే స్థాయికి చేరతాం. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో పైకి రావాలి..’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement