సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ సికింద్రాబాద్ పేరును మార్చేసి పెద్ద కుట్రకు తెర తీస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ చేపట్టాల్సిన సికింద్రాబాద్ బచావో ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. ఉదయం నుంచే బీఆర్‌ఎస్ నేతల్ని ఎక్కడికక్కడే నిలువరిస్తున్న పోలీసులు.. ఈ ఉదయం తలసానిని కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
బీఆర్‌ఎస్ ర్యాలీ నేపథ్యంలో.. జంట నగరాల్లోని నేతలను పోలీసులు ఎక్కడికక్కడే నిలువరించారు. పలువురిని గృహ నిర్భందం చేశారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను ఖండిస్తూ తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడారు. ‘‘రైల్వే స్టేషన్ నుంచి ఎంజీరోడ్డు దాకా సికింద్రాబాద్ బచావో పేరిట శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. నల్ల జెండాలు, కండువాలతో ర్యాలీ చేయాలనుకున్నాం. నిన్న పోలీసులు మా ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలించారు. అయితే లష్కర్ సాధన సమితికి అనుమతి రద్దు చేస్తున్నట్లు రాత్రి 10.40 నిమిషాలకు మెసేజ్ పెట్టారు. నిన్ననే సమాచారం అందించి ఉంటే.. కోర్టుకు వెళ్లేవాళ్లం.
మా ప్రాంతం పేరు లేకుండా.. మా అస్తిత్వం దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లు అంటున్నారు. మాకు సికింద్రాబాద్‌తో ఉన్నది మట్టి సంబంధం. ఇప్పటికే వేల మందిని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా శాంతిర్యాలీ అడ్డుకుని మీరు పైశాచిక ఆనందం పొందవచ్చు. న్యాయపరంగా కోర్టుకు వెళ్లి ర్యాలీ నిర్వహించి తీరతాం అని తలసాని అన్నారు.
తలసానిని బయటకు పోనివ్వకుండా..
తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం తలసాని బయటకు వచ్చారు. అయితే ఆయన్ని ఎటూ పోనివ్వకుండా పోలీసులు తమ వాహనాలను అడ్డుపెట్టారు. తాను ఇంటికి వెళ్తానని తలసాని చెప్పినా పోలీసులు వినలేదు. తమ వాహనంలో దిగబెడతామంటూ ఆయన చెప్పారు. దీంతో ఆయన మళ్లీ తెలంగాణ భవన్‌లోకే వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.


