రాజ్యసభ అభ్యర్థిగా సుప్రియా శ్రీనేత్‌?

Congress Party: AICC Social Media Chairman Supriya Shrinate from Telangana - Sakshi

రెండు స్థానాల్లో ఒకటి ఏఐసీసీకి..మరోటి రాష్ట్రానికి

బీసీలకు ఇస్తే రేసులో వీహెచ్, విజయశాంతి!  

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏఐసీసీ సోషల్‌ మీడియా చైర్మన్‌ సుప్రియా శ్రీనేత్‌కు అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. ఈసారి తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కే చాన్స్‌ ఉన్న నేపథ్యంలో ఒకటి ఏఐసీసీ నుంచి మరోటి తెలంగాణ నుంచి భర్తీ చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ జర్నలిస్టు సుప్రియా శ్రీనేత్‌ పేరును పరిశీలిస్తున్నారని గాందీభవన్‌ వర్గాలంటున్నాయి.

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ లేదంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాందీలను తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయించాలని, లేదంటే రాజ్యసభకు పంపాలని కోరుతూ టీపీసీసీ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలు కాని పక్షంలో శ్రీనేత్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రులుగా పనిచేసిన ఇద్దరి నేతల పేర్లు కాంగ్రెస్‌ హైకమాండ్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఇక రాష్ట్రానికి చెందిన ఒకరిని ఈమారు రాజ్యసభకు పంపనున్నారు. చాలాకాలం తర్వాత రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభిస్తుండటంతో పలువురు నేతలు రేసులో ఉన్నారు. అయితే, ఈసారి తెలంగాణ నుంచి బీసీ నేతను రాజ్యసభకు పంపుతారనే చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు ఇవ్వాల్సి వస్తే జానారెడ్డి, రేణుకా చౌదరిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈనెల 15వ తేదీతో రాజ్యసభ అభ్యర్థిత్వాల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో బుధవారం రాజ్యసభ అభ్యర్థులెవరన్న దానిపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top