సీఎల్పీ నేత భట్టికి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు | Sakshi
Sakshi News home page

సీఎల్పీ నేత భట్టికి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు

Published Thu, Jul 1 2021 3:24 PM

Congress High Command Call To CLP Leader Bhatti Vikramarka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. దీంతో ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత భట్టికి అధిష్టానం నుంచి రావడం చర్చంశనీయమైంది. కొందరు సీనియర్లు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక పట్ల అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. టీపీసీసీ.. టీడీపీ పీసీసీగా మారుతుందంటూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. భట్టి మాత్రం మౌనంగానే ఉన్నారు. మరి కొంత మంది సీనియర్లు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశముందని సమాచారం. రేవంత్‌రెడ్డిని టీపీసీపీ అధ్యక్షునిగా నియమించడం పట్ల కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సారథిగా కొత్తగా ఎంపికైన మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌కు అధ్యక్షుడు కావడం, తన నియామకాన్ని కొందరు పార్టీ నేతలు బహిరంగంగానే వ్యతిరేకించిన నేపథ్యంలో ఎక్కడా అసంతృప్తి ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తనను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించిన రోజే రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దాయన జానారెడ్డిని కలిసిన రేవంత్‌ పార్టీ నేతలందరితో సమన్వయమే ఎజెండాగా ముందుకెళ్తున్నారు.


 

Advertisement
Advertisement