
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే..
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్స్ లాంటివి. ఈ తరుణంలో అధికార-విపక్షాలు ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నాయి. ఈ క్రమంలో.. ‘గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా’ కాంగ్రెస్ ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయా రాష్ట్రాల్లో పర్యటించేందుకు తేదీలు ఖరారయ్యాయి.
ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అవి ముగిసిన వెంటనే ఆయన రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. ఎన్నికల రాష్ట్రాల్లో పర్యటించి సమీక్షించడమే కాకుండా.. ర్యాలీల్లో ఆయన ప్రసంగించనున్నట్లు ఏఐసీసీ శ్రేణులు చెబుతున్నాయి.
ఆగష్టు 13వ తేదీన ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌తో ఆయన ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 18వ తేదీన తెలంగాణలో, ఆగష్టు 22వ తేదీన మధ్యప్రదేశ్ భోపాల్, ఆగష్టు 23వ తేదీన జైపూర్‌లో ఆయన పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలకు చెందిన నేతలతో ఖర్గే వరుసగా భేటీ అవుతున్నారు. ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశాలకు రాహుల్ గాంధీతో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం హాజరవుతున్నారు.
ఇదీ చదవండి: బిల్కిస్ బానో దోషుల్ని వదలొద్దూ!