కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. శనివారం ఉదయం ఈ ఘటన మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కలకలం రేపింది. సార్… నేను నా భార్యను గొంతు నులిమి చంపేశా. ఆమె శరీరం ఇంట్లో దుప్పటిలో చుట్టి ఉంది” అని చెప్పాడు.
భార్యను హత్య చేసిన తర్వాత సచిన్ నాలుగు గంటల పాటు నగరంలో తిరిగాడు.. పారిపోవాలనుకున్నాడు. చివరికి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని.. సంఘటనా స్థలానికి అతని భార్య శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఫతేహ్‌పూర్ జిల్లా మోహన్‌పూర్ గ్రామానికి చెందిన సచిన్, శ్వేత ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో కోర్టులో పెళ్లి చేసుకున్నారు. మొదట సూరత్‌లో నివసిస్తూ సచిన్ ఫ్యాక్టరీలో పనిచేశాడు. నెలరోజుల తర్వాత కాన్పూర్‌కి వచ్చి గది అద్దెకు తీసుకుని, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై సచిన్‌కు అనుమానం కలిగింది. శ్వేత ఖాతాలో తరచూ డబ్బు జమ అవుతుండటంపై సచిన్ నిలదీశాడు. ఆమె తన అమ్మమ్మ పంపిందని చెప్పింది. ఎదురింట్లో ఉండే యువకులపై కూడా భర్తకు అనుమానం కలిగింది.
భార్య ప్రవర్తనపై నిగ్గు తేల్చడానికి సచిన్.. స్నేహితులతో పార్టీకి వెళ్తున్నానని.. ఇంటికి రానంటూ భార్యకు తెలిపాడు. కానీ తిరిగి వచ్చి గది తలుపు తెరిచి ఉండగా, భార్యతో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. స్థానికులు 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కి కాల్ చేయడంతో పోలీసులు వారిని స్టేషన్‌కి తీసుకెళ్లారు. దంపతులను పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు.
ఇంటికి చేరుకున్న తర్వాత సచిన్‌కు భార్యతో గొడవ మరింత ముదిరింది. ‘‘నన్ను చంపినా నేను ఆ యువకులతోనే ఉంటాను” అంటూ శ్వేత బెదిరించిందని సచిన్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఆగ్రహంతో ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. “మేము ఒకరికి ఒకరం మాత్రమే ఉన్నాం. పారిపోయి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఆమెకు ఎవరూ లేరు. నాకు కూడా ఎవరూ లేరు. అందుకే పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయాను” అని చెప్పాడు. శ్వేత మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపించారు.


