
న్యూఢిల్లీ: మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సాధించి, మహిళా నేత రేఖా గుప్తా(Rekha Gupta)ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఫిబ్రవరి 24న ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందు ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రేఖా గుప్తా త్వరత్వరగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జీతం ఎంత? ఎన్నికల్లో ఓటమి పాలయిన కేజ్రీవాల్‌కు మాజీ సీఎంగా ఎంత పింఛన్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతి నెలా రూ.1.70 లక్షల జీతం అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని 2023, మార్చి నాటి ఆర్డర్ ప్రకారం నిర్ణయించారు. దీనిలో ఆమె ప్రాథమిక జీతం(Basic salary) రూ. 60,000. వీటికితోడు ఆమెకు పలు భత్యాలు కూడా లభిస్తాయి. వీటిలో రూ.30,000 అసెంబ్లీ భత్యం, రూ.25,000 సెక్రటేరియల్ సహాయం, రూ.10,000 టెలిఫోన్ భత్యం, రూ.10,000 ప్రయాణ భత్యం, రూ.1,500 దినసరి భత్యం ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రికి జీతంతో పాటు కారు, బంగ్లా సహా అనేక సౌకర్యాలు లభిస్తాయి. ముఖ్యమంత్రి తన ప్రైవేట్ కారును ఉపయోగిస్తే, ప్రతి నెలా రూ. 10,000 మొత్తం లభిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రభుత్వ నివాసానికి ప్రతి నెలా 5,000 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తారు. దీనికితోడు ముఖ్యమంత్రి తన పదవీకాలంలో రూ.12 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.
ఇప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎంత పెన్షన్ వస్తుందనే విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యేల మాదిరిగానే ఆయనకు రూ. 15,000 పెన్షన్ మొత్తం లభిస్తుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిస్తే, ఈ మొత్తంపై వెయ్యి రూపాయలు పెరుగుతుంది. కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి అయినందున ప్రభుత్వ వసతి గృహం, ప్రభుత్వ కారు, డ్రైవర్ సేవలు లభిస్తాయి. దీనితో పాటు టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రయాణ భత్యం, ఉచిత వైద్య సౌకర్యాలు కూడా లభిస్తాయి.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..