CM KCR Meets Jharkhand CM Hemant Soren, Discussed National Politics - Sakshi
Sakshi News home page

CM KCR: దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Mar 4 2022 6:27 PM | Updated on Mar 5 2022 2:54 AM

CM KCR Meets Jharkhand CM Hemant Soren, Discussed National Politics - Sakshi

రాంచీలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్, ఆయన తండ్రి శిబు సోరెన్‌కు వెండి వీణను బహూకరిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సంతోష్‌కుమార్, వినోద్‌కుమార్, శ్రీనివాస్‌ గౌడ్, కవిత

సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు ఒక గట్టి ప్రయత్నం అవసరమనే ఉద్దేశంతో చర్చలు జరుగుతున్నాయని.. ఇప్పటివరకు ఏ ఫ్రంట్‌ ఖరారు కాలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని.. ప్రజలు ఆశించిన ఫలాలు అందించేందుకు కొత్త మార్గంలో సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే ఆ మార్గం ఏమిటి? ఎలా ఉండాలి? ఏం చేయాలనే విషయాలు ఖరారు కాలేదని.. త్వరలో అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. శుక్రవారం జార్ఖండ్‌ రాష్ట్ర రాజధాని రాంచీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలుత కేసీఆర్‌ మాట్లాడారు. మెరుగైన భారత్‌ను నిర్మించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పొరుగున ఉన్న చైనా సహా ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందగా.. మన దేశం చాలా విషయాల్లో వెనుకబడిపోయిందని కేసీఆర్‌ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని, దీనిని సరిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఆ దిశగానే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.  

ఫలవంతంగా చర్చలు 
హేమంత్‌ సోరెన్‌తో జాతీయ రాజకీయాల గురించి చర్చించానని, ఫలవంతంగా చర్చలు జరిగాయని కేసీఆర్‌ చెప్పారు. పురోగామి భారత్‌ నిర్మాణంలో జర్నలిస్టులు సహా అందరి పాత్రను కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతమున్న భారత్‌ కంటే ఎన్నో రెట్లు మెరుగైన భారత్‌ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందజేయాలన్నదే తమ ఆకాంక్ష అని.. అందుకు అనుగుణంగానే తమ ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. ఏ విషయంలో ఎలా ముందుకు పోవాలనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించలేమని.. ఒకరిద్దరితో ఇది అయ్యే పనికాదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అందరూ కలిసి చర్చిస్తేనే ఒక దారి దొరుకుతుందని.. ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలా, మరోటి చేయాలా అన్నది త్వరలో తెలియజేస్తామని చెప్పారు. దీనికి ఇప్పుడే ఏదో ఒక ఫ్రంట్‌ పేరు పెట్టవద్దని కోరారు. 


చదవండికేసీఆర్‌కు పీకే ఉంటే కాంగ్రెస్‌కు 40 లక్షల ఏకే 47లు ఉన్నాయి: రేవంత్‌




ఉద్యమానికి శిబుసోరెన్‌ అండ 
2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు.. జార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎంఎం) అధినేత శిబుసోరెన్‌ తొలిసారి ప్రత్యేక అతిథిగా హాజరై తెలంగాణ ప్రజలకు వెన్నంటి నిలిచారని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ప్రతిదశలో అండగా నిలిచిన శిబుసోరెన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నామని.. తెలంగాణ అభివృద్ధి దిశలో సాగుతున్న తీరుపై శిబుసోరెన్‌ హర్షం వ్యక్తం చేశారని చెప్పారు.


శుక్రవారం రాంచీలో జార్ఖండ్‌ ముక్తిమోర్చా అధినేత శిబుసోరెన్‌కు పాదాభివందనం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 


చదవండి: భయం లేదు.. బాధ్యత లేదు..! విచిత్రంగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు..

‘‘గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్‌ సంతోష్‌ బాబుతోపాటు ఇతర సైనికుల కుటుంబాలకు సాయం చేస్తామని గతంలోనే ప్రకటించాం. జార్ఖండ్, పంజాబ్‌ వంటి ఆరేడు రాష్ట్రాల్లో ఆ సైనికుల కుటుంబాలు ఉన్నాయి. వీర సైనికులకు ఆర్థిక సాయం చేసే అంశాన్ని జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ వద్ద ప్రస్తావిస్తే.. దానికి సమ్మతించి రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మేం చేయగలిగిన సాయం చేశాం.’’అని కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. అమర జవాన్‌ కుందన్‌ కుమార్‌ ఓఝా భార్య నమ్రతాకుమారికి.. మరో అమర జవాన్‌ గణేశ్‌ కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్‌ అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement