
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వేణు ఫైర్
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకం కట్టలు తెంచుకుంటోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎం చంద్రబాబు కక్షలతో రాజకీయ ప్రత్యర్థులను, కళాకారులను, విశ్లేషకులను అరెస్టు చేస్తూ నియంత పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. వేణుగోపాలకృష్ణ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుతో చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు పతాక స్థాయికి చేరాయన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కొన్ని నెలల క్రితమే పోసాని ప్రకటించారని తెలిపారు. గొంతు ఆపరేషన్ చేయించుకున్నారని, అనారోగ్యంతో ఉన్నారని, అయినా చంద్రబాబు సర్కారు క్రూరంగా అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.