మీరెలా చెబితే అలా..! | Sakshi
Sakshi News home page

మీరెలా చెబితే అలా..!

Published Thu, Feb 8 2024 4:49 AM

Chandrababu with top BJP leaders on seat distribution - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తూ పూర్తిస్థాయిలో ప్రజాదరణ పొందిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే పుట్ట గతులుండవని తేలిపోవడంతో ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ బలమూ సరిపోకపోవడంతో బీజేపీ కాళ్లపై పడ్డారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చారు.

బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఎలాగైనా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవాలన్న భావనతో సీట్ల సర్దుబాటులో వారెలా చెబితే అలా చేస్తానని చెప్పారు. రాత్రి ఏడున్నర గంటలకే ఈ భేటీ ఉంటుందని ప్రచారం జరిగినా,  రాత్రి 11.30 గంట­లకు అమిత్‌ షా నివాసంలో సమావేశమయ్యారు.

సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటు, బీజేపీకి అందించే సహకారం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తనకు పూర్తి సహకారం అందిస్తే బీజేపీ ఎలా చెబితే అలా నడుచుకుంటానని బాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ బలంగా ఉన్న చోట సైతం త్యాగాలు చేసేందుకు సిధ్దపడతాననే హామీ ఇ చ్చి నట్లుగా చెబుతున్నారు. 

హోటల్‌లో రహస్య భేటీ 
కాగా ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు నేరుగా పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసానికి వెళ్తారని అందరూ భావించారు. అయితే, బాబు అక్కడికి కాకుండా లీ మెరిడియన్‌ హోటల్‌కు వెళ్లారు. ఆయన వెంట ఉన్న ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రఘురామకృష్ణంరాజు, ఇతర నేతలు హోటల్‌ లాబీల్లోనే ఉండిపోయారు.

బాబు ఒక్కరే హోటల్లోకి వెళ్లారు. గంటన్నర తర్వాత బయటకు వచ్చారు. చంద్రబాబు హోట్‌ల్‌లో ఎవరితో అంత రహస్యంగా భేటీ అయ్యారో టీడీపీ ఎంపీలు, ఇతర నేతలకు కూడా తెలియలేదు. హోటల్‌ నుంచి గల్లా ఇంటికి వెళ్లారు. అక్కడ బాబుతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ అయ్యారు. 

ముందే రాయబారం నడిపిన సీఎం రమేశ్, కంభంపాటి 
కాగా అమిత్‌షాతో చంద్రబాబు భేటీ, పొత్తులపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు ముందుగానే రాయబారం నడిపారు. వారు మంగళవారమే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే లాభించే అంశాలపై వివరణ ఇచ్చారు. పొత్తు కుదిరిన పక్షంలో ఎలాంటి షరతులకైనా బాబు సిధ్దంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. దీంతో బాబు­తో భేటీకి బీజేపీ అగ్రనేతలు అంగీకరించినట్లు సమాచారం.  

పొత్తులతో ప్రయోజనం ఏమిటి?
ఈ చర్చల్లో పొత్తుతో బీజేపీకి లాభించే అంశాలు, ఓట్ల బదిలీ అవకాశాలు, జనసేన పార్టీ బలాబలాలు వంటి అంశాలపై బీజేపీ పెద్దలు ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని తమ నివేదికలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలో పొత్తులతో ఒనగూరే ప్రయోజనాలు ఏమిటన్న ప్రశ్నలనే నేతలు లేవనెత్తినట్లు సమాచారం.

కచ్చితంగా పొత్తు అవసరమైతే బీజేపీకి 6 నుంచి 8 ఎంపీ సీట్లు, 25 వరకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని, అప్పుడే ఇరు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుందని అమిత్‌షా, నడ్డా స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే బీజేపీకి ఆ స్థాయిలో అభ్యర్థులు లేరని, 10 నుంచి 15 స్థానాల వరకైతే అభ్యంతరం ఉండబోదని బాబు చెప్పినట్లుగా తెలిసింది.

లోక్‌సభ స్థానాల్లో 5 లేదా 6 బీజేపీకి ఇచ్చేందుకు బాబు సిద్ధపడినట్లు తెలిసింది. పొత్తులకు అంగీకరిస్తే ఎలాంటి షరతులకైనా తాను సిద్ధమని బాబు అన్నట్లు సమాచారం. రెండు పార్టీలకు సమాన లబ్ధి చేకూరే పక్షంలోనే పొత్తులు ఉంటా­యని బీజేపీ అగ్రనేతలు స్పష్టంగా చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌తో కూడా చర్చించిన అనంతరం పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కబురు చేస్తామని వారు బాబుకు చెప్పినట్లు సమాచారం.  

Advertisement
 
Advertisement
 
Advertisement