చంద్రబాబు మరోసారి అప్రతిష్టపాలు

Chandrababu Naidu Bought Ysrcp Mla For Mlc Elections Ap - Sakshi

సోషల్ మీడియాలో ఒక జోక్ వ్యాప్తిలోకి వచ్చింది. అదేమిటంటే.. బైకులు కొనడం ధోనీకి సరదా! కారులు కొనడం సచిన్ కు సరదా! ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు సరదా .. అన్నది ఆ జోక్.. ఇది చూడడానికి హాస్యంగానే ఉన్నా, ఇందులో చాలా అర్ధం, పరమార్ధం ఉన్నాయి. టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఇలాగే ఉంటుందని, ఆయన ఎంత సేపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారన్న అభిప్రాయం సర్వత్రా మరోసారి ఏర్పడింది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను, నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టిడిపి కొనుగోలు చేసిందన్న విమర్శ ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది.

వారిలో ఇద్దరు ముందుగానే వైఎస్సార్‌సీపీ ఓటు వేయబోవడం లేదన్న సంకేతం ఇచ్చారు. మరో ఇద్దరు మాత్రం సీక్రెట్గా టిడిపికి ఓటు వేసి దొరికిపోయారు. వైఎస్సార్‌సీపీ నాయకత్వం సమర్దంగా కోడింగ్ ను అమలు చేసి వారిని ఇట్టే పట్టేసింది.  వారిని అంతకుముందే పిలిచి వచ్చే శాసనసభ ఎన్నికలలో టిక్కెట్లు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర పదవులు ఇస్తామని చెప్పారు. అయినా వారు సంతృప్తి చెందలేదు. తెలుగుదేశం ఆశపెట్టడంతో వాటికి లొంగి పోయారని, ఒక్కొక్కరికి పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు చంద్రబాబు ముట్ట చెప్పారన్నది తమ సమాచారం అని ప్రభుత్వ సలహాదారు ,వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

దాంతో ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎలాగూ రాజకీయ జీవితం అనిశ్చితిగా మారినందున, టిడిపి ఇచ్చే డబ్బు అయినా గిట్టుబాటు అవుతుందని అనుకుని ఉండాలన్న వాదన సహజంగానే ముందుకు వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో చంద్రబాబు మరోసారి అప్రతిష్టపాలు అయితే, ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిదే పైచేయి అయ్యింది. ఒకరకంగా సీఎం జగన్ వేసిన ట్రాప్ లో చంద్రబాబు చిక్కి విలవిలలాడినట్లు అయింది. సాదారణంగా ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను  అధికార పార్టీ  ప్రలోభ పెడుతుందని అంతా విశ్వసిస్తారు. కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి దిక్కుమాలిన పని ప్రతిపక్షం చేస్తుండడం విశేషం. జగన్ ఎప్పుడైతే ఇద్దరు అసంతృప్త ఎమ్మెల్యేలను పిలిచి టిక్కెట్లు ఇవ్వలేమని స్పష్టం చేశారో, అప్పుడే వీరిపై డౌటు వచ్చి ఉండాలి. అయినా వారిని ఇతరత్రా వనరులు సమకూర్చి సంతృప్తి పరచాలని అనుకోలేదు. పోతే ఒక సీటు పోయిందిలే అనుకున్నారు. ఒకవేళ చంద్రబాబు కనుక వీరిని కొనుగోలు చేస్తే ఆ విషయం బయటపడి ఆయనే గబ్బు అవుతారులే అని వ్యూహాత్మకంగా ఊరుకుని ఉండవచ్చు.

2015లో తెలంగాణ శాసనమండలి ఎన్నికలలో కూడా చంద్రబాబు ఇలాగే టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయబోయి అడ్డంగా బుక్ అయిపోయిన సంఘటన ఎవరూ మరవలేదు. ఆ దెబ్బకు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను వదలుకుని హుటాహుటిన విజయవాడకు చంద్రబాబు వెళ్లిపోవలసి వచ్చింది. ఈ చేదు అనుభవం ఉన్నా, ఏపీలో మళ్లీ అదే ప్రకారం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్య హననానికి పాల్పడ్డారు. తమకు ఎన్నెన్ని కోట్ల డబ్బు ముట్టింది అప్పట్లో ఫిరాయించిన ఎమ్మెల్యేలు కొందరు ఓపెన్ గానే చెప్పేవారు. తదుపరి మళ్లీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు ఆ ధోరణి మానుకోలేదనుకోవాలి. మళ్లీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పరువు పోగొట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ రకంగా చంద్రబాబు తన పార్టీకి ఎమ్మెల్సీని గెలిపించుకున్నా, అది అనైతిక విజయం అని తేల్చేసిన జగన్‌.. ఎన్నికలలో చంద్రబాబు కోట్లు వెచ్చించడం మామూలే అన్న భావన కలిగేలా చేయగలిగారు. ఆ రకంగా జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడినట్లు అయింది.

అదే చంద్రబాబు ఇలా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించకుండా ఉన్నట్లయితే ఆయన పార్టీ అభ్యర్ది గెలిచే అవకాశం ఉండేదికాదు. అయినా విలువ మిగిలేది. టిడిపి ఎమ్మెల్యేలు నలుగురు అధికార పార్టీకి ఓట్లు వేశారు కదా అని కొందరు ప్రశ్నించవచ్చు. అది నిజమే. కాని వారు పార్టీకి దూరం అయి దాదాపు రెండు,మూడేళ్లు అయ్యింది. వారిపై చర్యపై తీసుకోవడానికి కూడా చంద్రబాబు వెనుకాడారు. అందువల్ల తమకు టిడిపి ఎమ్మెల్యేలుగా ఉన్న ఇరవై మూడు మంది ఓట్లు వేశారన్న వాదనకు బలం లేకుండా పోయింది. తమ పార్టీకి నలుగురు దూరం అయ్యారు కనుక వైఎస్సార్‌సీపీ నుంచి నలుగురిని ఆకర్షించడంలో తప్పేముందని ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. విధానపరంగా విభేదించినవారు ఎవరైనా ఉంటే , ఆ ప్రాతిపదికన టిడిపికి మద్దతు తీసుకోవచ్చు. ఆ విషయాన్ని బహిరంగంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే దానికి విలువ ఉండేది. అలాకాకుండా రహస్యంగా ఆపరేషన్ చేయడం వల్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అనైతికంగా కొనుగోలు చేశారన్న విమర్శను ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. టిడిపికి దూరం అయిన నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఎప్పటి నుంచో ఉంటున్నారు కనుక వారిని కొనుగోలు చేయవలసిన  అవసరం కాని, పరిస్థితి కాని వైఎస్సార్‌సీపీకి ఉండదు.

టిడిపి ఎమ్మెల్యేలు ఎవరికి జగన్ డబ్బు ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో ఎన్.టి.ఆర్.ను పదవి నుంచి దించినప్పుడు కాని, ఆయా ఇతర సందర్భాలలో కాని చంద్రబాబు తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం డబ్బులు ఇస్తుండేవారని చెప్పుకునేవారు. జగన్ పై అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ రాలేదు. నైతిక విలువలు, నిజాయితీ గురించి ఉపన్యాసాలు చెప్పే సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురి చేయడం  ఎంతవరకు కరెక్టు అని అంటే ఎవరూ సమర్దించజాలరు. ఇదే టైమ్ లో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు రావడం, అమరావతిలో సచివాలయం , కోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్టులలో కిక్ బాక్స్ పొందారన్న అభియోగాన్ని ఆదాయపన్ను శాఖ చేసింది.

ఎవరెవరి ద్వారా డబ్బు వసూలు చేసింది అన్ని వివరాలు ఆదాయపన్ను శాఖ రిపోర్టులో తెలిపింది.  ఆ విషయాన్ని సీఎం జగన్, మంత్రి అమరనాథ్‌లు అసెంబ్లీలో సవిస్తరంగా తెలియచేశారు. ఇదొక అప్రతిష్ట విషయంగా టిడిపికి, చంద్రబాబుకు మారింది. దీనిని ఖండించలేని దైన్య స్థితి. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని చంద్రబాబుపై వైఎస్ఆర్కాంగ్రెస్ ఆరోపించే పరిస్థితిని చంద్రబాబు తెచ్చుకున్నారు. ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకున్నామన్న సంతోషం మిగలకుండానే టిడిపి ఇలా భ్రష్టుపట్టిందన్న బాధ ఆ పార్టీ అభిమానులలో ఏర్పడడం విషాదమే. కొనసమెరుపు ఏమిటంటే వైసిపి నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తమకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని చెబుతుంటే, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనకు టిడిపి నుంచి ఆఫర్ వచ్చిందని, టిడిపి ఎమ్మెల్యే ఈ ఆఫర్ గురించి ప్రస్తావించారని ,దానిని ఒప్పుకోలేదని వెల్లడించారు. తాను సిగ్గు,శరం వదలివేస్తే పది కోట్లు వచ్చి ఉండేవని సంచలన వ్యాఖ్య చేయడం ద్వారా  ఎపిలో తెలుగుదేశం రాజకీయాలు ఏ విధంగా తయారైంది ప్రజలకు మరోసారి విశదమైందని అర్ధం చేసుకోవచ్చు.

-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top