
జనాభా పెంచాలంటున్న ఎలాన్ మస్క్‌కు తానే స్ఫూర్తి అంట
చంద్రబాబు మళ్లీ ఏసేశారు.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది తన చలవ తన గొప్పతనమే అని చెప్పుకోవడం ఆయనకు జన్మతః వచ్చిన దురలవాటు. హైదరాబాదులో రింగ్ రోడ్డు ఏర్పాటు.. ఐటీ అభివృద్ధి. . పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ నిర్మాణం.. నగరంలో ఇతరత్రా ప్రాజెక్టుల తో పాటు ఫార్మా ఇండస్ట్రీ వంటివన్నీ తానే తీసుకొచ్చానని ఎన్నో మార్లు చంద్రబాబు చెప్పారు. అసలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి కూడా తానే స్ఫూర్తి అని ఎన్నోమార్లు చెప్పుకున్నారు.
దేశంలో నేషనల్ హైవేస్ నిర్మించాలని నాటి ప్రధాని వాజపేయికి సలహా ఇచ్చింది కూడా తానేనని బాబు నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. పీవీ సింధు. పుల్లెల గోపీచంద్ వంటివారికి ప్రోత్సాహం కూడా తానే ఇచ్చానన్నారు.. దేశంలో వెయ్యి.. రెండు వేల నోట్లను రద్దు చేయాలని మోదీకి చెప్పింది కూడా తానేనన్నారు. బాబు ప్రకటనలు చూసి నవ్వుకునేవాళ్ళు నవ్వుకున్నారు.. అది వేరే విషయం.
ఇలా దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అన్నిటికీ నేనే నేనే అని చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. పైగా తను ఏం చెప్పినా తానా తందానా అనడానికి సొంతంగా మీడియా కూడా ఉందాయే. కాబట్టి ఆయన ఆటలు అలా సాగుతున్నాయి మాటలు అలా ముందుకు వెళుతున్నాయి. దేశంలో సంక్షేమ పథకాలను తెచ్చిందే తెలుగుదేశం అని కూడా చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు తొలిసారిగా కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చారని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు.
కానీ అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ బియ్యం పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాదులో ఐటీ పార్క్‌కు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వంటివి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయి. కానీ ఇవన్నీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ప్రపంచంలో జనాభా తగ్గిపోతోంది అంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనను సైతం చంద్రబాబు ఎత్తుకొచ్చారు.
ప్రపంచ జనాభా తగ్గుతోందంటూ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా అంటే భారం కాదు.. జనమే ఆస్తి అంటూ కొత్త రాగం అందుకున్నారు. వెలగపూడి సచివాలయం వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో జనాభా రేటు తగ్గుతోంది. కానీ, జనాభానే దేశాభివృద్ధికి కీలకం. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో యువత ఎక్కువ ఉంటే.. ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే కొన్ని దేశాల్లో బహుమతులు కూడా ఇస్తున్నారు. హంగేరిలో పెద్దకుటుంబాలకు కార్లు ఇస్తున్నారు. చైనాలో ఆర్థిక సాయం అందిస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో జనాభా నియంత్రణ కోసం పని చేశాం. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని నేనే చట్టం తీసుకొచ్చా. (కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపులో భాగంగా 1994 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఆమోదించింది.. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నారు).
ఇప్పుడు ఆ పరిస్థితి మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. జనాభా భారం కాదు.. జనమే ఆస్తి. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నారా చంద్రబాబు నాయుడికు ఒక్కడే తనయుడు నారా లోకేష్. నారా లోకేష్‌కు ఒక్కడే కొడుకు.. దేవాన్ష్!!. మరి జనాభా పెంచండి..అని బోడి సలహాలు ఇచ్చే చంద్రబాబు తన కొడుకు లోకేష్ కు ఎందుకు ఎక్కువమంది పిల్లల్ని కనమని చెప్పలేదు. ఒకే ఒక్కడిని ఎందుకు కన్నాడు..బాబు రూల్స్ పెడతారు.. పాటించరు.. ఆయన నీతులు వల్లిస్తారు.. పాటించరు.
-సిమ్మాదిరప్పన్న