‘నారాయణ’లో వడ్డీ దుకాణం! | Cash Collections For TDP Election Fund In Narayana Medical College, Details Inside - Sakshi
Sakshi News home page

‘నారాయణ’లో వడ్డీ దుకాణం!

Published Sun, Feb 11 2024 5:08 AM

Cash collections for TDP election fund - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నారా­యణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ డబ్బు వసూళ్ల వ్యవహా­రం వెలుగులోకి వచ్చింది.

వడ్డీ ఆశ చూపించి రాబోయే ఎన్నికల కోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాల వ్యాపా­రుల నుంచి వందల కోట్లు వసూలు చేసిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. నారా­యణకు చెందిన నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాల కేంద్రంగా ఈ వసూళ్లు జరిగాయి. దీనికోసం ఈ కాలేజిలో వారం క్రితం 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా రూ.650 కోట్లు వసూలు చేసి, రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. 

రూ.5 వడ్డీకి .. 
విద్యా సంస్థల అధినేత అయిన నారాయణకు మార్వాడీలు, వ్యాపారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. విద్యా సంస్థల కోసం వ్యాపారులతో తరచూ లావాదేవీలు నిర్వహించేవారు. దీంతో గత ఎన్నికల్లోనూ ఇలాగే రూ.2 వడ్డీకి రూ.400 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈసారి 2 రూపాయల వడ్డీకి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఐదు రూపాయలకు పెంచారు. ఈమేరకు ప్రకా­శం, నెల్లూరు జిల్లాల వ్యాపారులు, మార్వాడీ­లకు సమాచారమిచ్చారు.

వడ్డీ పెరగడంతో అనేక మంది వ్యాపారులు, మార్వాడీలు క్యూ కట్టారు. ఇలా నాలుగు రోజుల్లోనే రూ.650 కోట్లు సేకరించినట్లు సమాచారం. వ్యాపారులే కాకుండా, నారాయణ సంస్థలో పనిచేసే ఉద్యోగుల నుంచి కూడా నగదు సేకరించారు. ఈ సొమ్ముకు ఆధారాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఎవరికీ రశీదులు ఇవ్వలేదు. అందుకు బదులుగా టోకెన్ల ద్వారా లావాదేవీలు నిర్వహించారు.

వ్యాపారులు నగదు చెల్లించగానే టోకెన్లు ఇచ్చారు. వడ్డీ కావాల్సిన వారికి ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తామని, లేదంటే ఏడాది తర్వాత అసలు, వడ్డీ కలిపి ఇస్తామని వ్యాపారులకు చెప్పారు. నారాయణ కళాశాలలో వడ్డీ వ్యాపారం బయటకు పొక్కడంతో దుకాణాలు మూయించేశారు. నగదును రహస్య ప్రాంతంతో దాచేశారు. అక్కడి నుంచి పార్టీ అధినేత సూచనల మేరకు అభ్యర్థులకు చేరవేస్తారు. 

నారాయణ ఇష్టారాజ్యం 
చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి, ఆయన బినామీగా ఉన్న నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారు. ప్రతి ఎన్నికల సమయంలో తన విద్యా సంస్థల నుంచే డబ్బు సేకరించి చంద్రబా­బు­కు పంపుతుంటారు. అంతేకాదు తన విద్యా సంస్థల ఉద్యోగుల ద్వారానే సర్వేలు చేయించేవారు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే నారాయణకు ఎమ్మెల్సీ కట్టబెట్టి ఏకంగా మంత్రిని చేశారు.

చంద్రబాబు కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉంటూ ఆయన బినామీగా నారాయణ రాజధాని భూ­సే­కరణ నుంచి అన్ని­ంటా ఇష్టారాజ్య­ంగా వ్యవ­హరించా­రు. ఈ సంద­ర్భంగా భారీ స్థాయిలో అక్రమా­లకు పాల్ప­డిన విషయం తెలిసిందే. నారాయణ విద్యా సంస్థల్లోనూ విద్యార్థులపై అమానుష ఘటనలు పలుమార్లు వెలుగుచూశాయి. విద్యార్థుల బలవన్మరణాలకూ దారి తీశాయి. ఇటీ­వలి కాలంలో నారాయణ వైద్య కళాశాలలో డ్రగ్స్‌ కూడా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

రెండేళ్ల క్రితం ఓ వైద్యుడు మత్తు ఇంజక్షన్‌ చేసుకొని మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల విద్యా­ర్థులు అనేక మంది మత్తు పదా­ర్థాలకు బానిసలవుతున్నారని తల్లిదండ్రుల నుంచి పలు ఫిర్యా­దులు వచ్చాయి. కళాశాలలో నిషేధిత మందుల విక్రయాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జిల్లా ఔషధ నియ­ంత్రణ అధికారులు కాలేజీలో సోదాలు చేశారు.

Advertisement
Advertisement