
వరంగల్ సభతో ఆ పార్టీ అంతానికి ఆరంభం మొదలైంది
రైతుల ఆత్మహత్యలు, సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో విస్తృత కార్యక్రమాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతమొందించే శక్తి బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను మోసం చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కిందని, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంగళవారం రాత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం షురూ అయిందన్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు బీఆర్‌ఎస్సేనని, సభ తర్వాత ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం ఈ సభ ద్వారా కలిగిందని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత వ్యతి రేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు.
అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవడం అనే లక్షణాలు పుష్కలంగా ఉన్న రేవంత్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పోయిందన్నారు. ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతకు అనుగుణంగా ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవాలని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందన్నారు.
రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో చూపిస్తున్న నిర్లక్ష్యం, అకాల వర్షాల తో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీ కార్యాచరణ ఉండబోతుందని తెలిపారు. ఇటీవల వెలుగుచూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండ గట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగసభ
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీసభగా ఎల్కతుర్తి రజతోత్సవ సభ నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ కార్యకర్త, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అంతులేని అభిమానానికి ఎల్కతుర్తి సభనే నిదర్శనమన్నారు. ఈ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడారు. పార్టీ 25 సంవత్సరాల సంబురాన్ని వరంగల్ గడ్డపై నిర్వహించే అవకాశం తమకు ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విషయాల్లో తమకు దిశానిర్దేశం చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహణలో భాగమైన నేతలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు.