కాంగ్రెస్‌ 420 హామీలు అమలు చేసేదాకా విడిచిపెట్టం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ 420 హామీలు అమలు చేసేదాకా విడిచిపెట్టం

Published Sat, Jan 20 2024 1:43 AM

BRS Preparatory Meeting On Medak Lok Sabha Constituency: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్‌ పార్టీ నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత  వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం జరిగిన మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, అవి 420 హామీలని మండిపడ్డారు. గవర్నర్‌ ప్రసంగంలో తెలంగాణ గుల్లయ్యిందని, రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని, అబద్ధాలు మాట్లాడించారని, వాస్తవాలు ఏంటో తెలియజేసేందుకు ‘స్వేద’పత్రం విడుదల చేసినట్టు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన తెలంగాణ సమగ్ర అభివృద్ధిని గణాంకాలు, ఆధారాలతో సహా వివరించినట్టు చెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తానని,  రూ.2 లక్షల రుణం తెచ్చుకోండని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌ మాట్లాడారని గుర్తు చేశారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణాలు వసూలు చేయాలని, లేకుంటే కేసులు పెట్టమని ఆదేశాలు జారీ చేశారన్నారు. వ్యవసాయ రుణాలు విడతల వారీగా మాఫీ చేస్తా మని ఇచ్చిన హామీని విస్మరించి, ముక్కుపిండి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం శోచనీయమన్నారు.

ప్రియాంకాగాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి విక్రమార్క అలా చెప్పలేదని హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టేది లేదని పునరుద్ఘాటించారు. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ అదానీని తిడితే, రేవంత్‌రెడ్డి అదే సమయంలో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని, నోటికి వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతున్నదన్నారు. కేసీఆర్‌ ఉన్నంతకాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్‌ రాగానే ఎలా వస్తున్నాడని కేటీఆర్‌ నిలదీశారు.  

ఈసారి కూడా మెదక్‌ మనదే ...  
మెదక్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని కేటీఆర్‌ అన్నారు. గత ఎంపీ ఎన్నిక ల్లో హరీశ్‌రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయడంతో అత్యధిక మెజారిటీ సాధించామని, మరోసారి అది పునరావృతం కావాలన్నారు. కొందరు దు్రష్పచారం చేయడంతోనే  మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో తాను ఒక్కదాన్నే ఓడిపోయానని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో  రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. 

పనికొచ్చే సమీక్షలు చేయడం లేదు: హరీశ్‌రావు
కాంగ్రెస్‌ ప్రభుత్వం పనికొచ్చే సమీక్షలు చేయడం లేదని, సమీక్షల తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ లీకులు ఇస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదంతా ఓ ఆరునెలలు సాగుతుందేమో, ఆ తర్వాత చెల్లదని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, భవిష్యత్‌లో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందన్నారు.

కొందరు బీఆర్‌ఎస్‌ నుంచి అధికారం కోసం కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నారని, చెత్త పార్టీ నుంచి వెళ్లిపోతోందని భావిద్దామని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్‌ వారు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులతో భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీస్‌ స్టేషన్లు, జైళ్లు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా, 39 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేలు బస్సు వేసుకుని భాదితుల దగ్గరికి వచ్చి అండగా ఉంటారన్నారు. రైతు బంధు విషయంలో కేసీఆర్‌ చిత్తశుద్ధిని, ఇప్పటి సీఎం రేవంత్‌ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Advertisement
Advertisement