
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) క్షేత్ర స్థాయిలో పార్టీ బాధ్యతల అప్పగింతపై దృష్టి సారించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున 39 మంది గెలుపొందగా, 80 చోట్ల పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారికే బాధ్యతలు అప్పగించింది. అలాగే పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్ని కల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే బాధ్యతను ఓడిన అభ్యర్థులకే అప్పగించింది.
ఓటమి పాలైన నేతల్లో ఎక్కువమంది మాజీ శాసనసభ్యులే ఉండటంతో వీరినే నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలుగా ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు, కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతను వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏ లోక్‌సభ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి అనే అంశంతో సంబంధం లేకుండా నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలు, కేడర్‌తో సమావేశాలు ఏర్పాటు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఆదేశించారు.
లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా సమీక్ష
రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలు లోక్‌సభలో ప్రాతినిథ్యం వహిస్తుండగా ఇందులో బీఆర్‌ఎస్‌కు చెందిన వారు 9 మంది ఉన్న విషయం తెలిసిందే. వీరంతా సమావేశాలకు అందుబాటులో ఉండాల ని తుంటి ఎముకకు శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సుమారు వారం రోజుల క్రితం ఆదేశించారు. అయితే వైద్యుల సూచన నేపథ్యంలో ఈ భేటీలు వాయిదా పడినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ పార్టీ యంత్రాంగాన్ని లోక్‌సభ ఎన్నికల దిశగా సన్నద్ధం చేయడంపై కసరత్తు కొనసాస్తున్నారు. చేవెళ్ల, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ నియోకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై పార్టీ అధినేత స్పష్టత ఇవ్వడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించారు. చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ (సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి) పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో రెండురోజుల క్రితమే సమన్వయ సమావేశం నిర్వహించారు.
ప్రాతినిథ్యంలేని నియోజకవర్గాలపై నజర్
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఒక్క సెగ్మెంట్‌లోనూ గెలవని లోక్‌సభ నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. భువనగిరి, వరంగల్, మహబూబాబాద్ సెగ్మెంట్ల పరిధిలో పార్టీకి కేవలం ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఆదిలాబాద్, జహీరాబాద్, నాగర్‌కర్నూల్ పరిధిలో ఇద్దరు, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలో ముగ్గురేసి చొప్పున బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు.
ఈ నేపథ్యంలో ఆయా లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన, ఓటమి పాలైన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, సాధించిన లేదా కోల్పోయిన మెజారిటీ, ప్రభావం చూపిన అంశాలు, పార్టీ యంత్రాంగం పరిస్థితిపై ఇప్పటికే పోస్ట్‌మార్టం జరిగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఈ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు అవసరమైన కార్యాచరణపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ పైనా కసరత్తు జరుగుతోంది.