ఇక ‘పట్టభద్రుల’ పరీక్ష | Sakshi
Sakshi News home page

ఇక ‘పట్టభద్రుల’ పరీక్ష

Published Wed, May 15 2024 5:21 AM

BRS focus on council byelection in telangana

మండలి ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌

‘వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ’ ఎమ్మెల్సీ స్థానానికి 27న ఎన్నిక 

సిట్టింగ్‌ సీటును తిరిగి కైవసం చేసుకోవాలనే పట్టుదలతో గులాబీ దళం

పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ఏనుగుల రాకేశ్‌రెడ్డి నామినేషన్‌

ప్రచార వ్యూహంపై దృష్టి సారించిన నేతలు

నేడు మూడు జిల్లాల ముఖ్య నేతలతో కేటీఆర్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఈ నెల 27న జరిగే శాసనమండలి పట్టభద్రుల కోటా ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. ‘వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ సిట్టింగ్‌ స్థానం కావడంతో తిరిగి కైవసం చేసుకోవడాన్ని బీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ పోలింగ్‌ ముగిసిన వెంటనే రంగంలోకి దిగింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, పార్టీ ఎమ్మెల్యేలతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు బుధవారం కీలక భేటీ ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం
ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2027 ఏప్రిల్‌ వరకు అవకాశం ఉన్నా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 27న ఉప ఎన్నిక జరగనుంది. పోలింగ్‌కు కేవలం 12 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ముమ్మర ప్రచారం నిర్వహించేలా కేటీఆర్‌ బుధవారం జరిగే భేటీలో దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది.

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార, సమన్వయ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ప్రచారాన్ని సమన్వయం చేస్తారు. మూడు జిల్లాల్లో సుమారు 4.61 లక్షల మంది పట్టభద్రులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు, మహిళలు కీలకం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగించాల్సిన ప్రచారంపై బీఆర్‌ఎస్‌ వ్యూహాన్ని ఖరారు చేస్తోంది. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు గ్రామాలు, మండలాల వారీగా ఓటర్ల జాబితాను అందజేసి వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.

లోక్‌సభ పోలింగ్‌ సరళిపై సమీక్ష
రెండురోజుల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సరళిపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మంగళవారం కూడా సమీక్షించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను పలువురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో పాటు పార్టీ నేతలు కలిశారు. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా పోలింగ్‌ సరళిపై ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపారనే కోణంలో చర్చ జరిగింది. కాగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా కేసీఆర్‌ వ్యక్తం చేసినట్లు నేతలు వెల్లడించారు. 

Advertisement
Advertisement