టచ్‌ చేసి చూడు: కేసీఆర్‌ సవాల్‌  | Sakshi
Sakshi News home page

టచ్‌ చేసి చూడు: కేసీఆర్‌ సవాల్‌ 

Published Wed, Feb 7 2024 12:49 AM

BRS chief KCR challenges CM Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ విషయంలో కేసీఆర్‌ ఏనాడూ వెనక్కిపోడు. ఉడుత బెదిరింపులకు భయపడడు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నదీ జలాల విషయంలో రాష్ట్రం హక్కులను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతాం. కొత్త సీఎం బీఆర్‌ఎస్‌ పార్టీని, వ్యక్తిగతంగా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను, నా పార్టీని టచ్‌ చేయడం నీతో కాదు. నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది..’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.  

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం, తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల తుంటి ఎముకకు శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్‌.. తొలిసారిగా మంగళవారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చారు.

కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత అంశంపై మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్రానికి, ముఖ్యంగా రైతాంగానికి వాటిల్లే నష్టాలు, ఇతర పర్యవసానాలు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అనుసరించిన వైఖరి వారికి వివరించారు. 

ప్రాజెక్టుల కట్టల మీదకి కూడా పోలేం 
‘రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి.. కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారింది. నాగార్జునసాగర్, శ్రీశైలం సహా కృష్ణా నదిమీద అన్ని ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పజెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన జుట్టును కేంద్రం చేతికి అందించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ, రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను అధికారంలో ఉన్న పదేళ్లలో కృష్ణా ప్రాజెక్టుల విషయమై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ఏనాడూ తలొగ్గలేదు. ప్రాజెక్టులు తమకు అప్పగించాలని, లేదంటే తామే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నన్ను బెదిరించారు.

కానీ నేను.. కావాలంటే తెలంగాణలో నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా. రాష్ట్రపతి పాలన పెట్టుకో. తెలంగాణకు అన్యాయం చేస్తానంటే మాత్రం అసలు ఊరుకోను. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా. కేఆర్‌ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేస్తున్న ఎత్తుగడలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది., పదేళ్ల పాటు కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ ప్రాజెక్టులను కాపాడింది. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుని సంతకాలు చేయడం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించింది..’ అని కేసీఆర్‌ తెలిపారు. 

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుదాం 
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల హైదరాబాద్‌ రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందక తిరిగి కరువు కోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రజా మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాదకర, మూర్ఖపు వైఖరిని తిప్పికొడుతూ, కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావలసిన వాటాలను, ఉన్న హక్కులను నూటికి నూరు శాతం కాపాడేందుకు ఎంతదాకానైనా పోరాడాల్సిందే.

నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే.. నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్‌ఎస్‌ కార్యకర్తలది. తెలంగాణ ఉద్యమకారులది. తెలంగాణ ఉద్యమం సమయంలోనే సాగు, తాగునీటి హక్కుల కోసం పోరాడాం. ‘మా నీళ్లు మాకే ’ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ప్రజా క్షేత్రంలో ఎండగడదాం..’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

పాలన చేతకాక రేవంత్‌ కారుకూతలు 
‘అసెంబ్లీలో మనం తక్కువేంలేం..39 మందిమి ఉన్నాం. ప్రతి అంశాన్ని అక్కడ ఎండగడతాం. ఈ సీఎం ఎక్కువ మాట్లాడుతున్నాడు. సీఎం అనేటోడు ఈరోజు ఉంటాడు. రేపు పోతాడు. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. మీరు ఎవరూ గాబరా పడొద్దు. రేవంత్‌వి పిల్ల చేష్టలు. పాలన చేతకాక నా మీద కారు కూతలు కూస్తున్నడట. నల్లగొండలో సభ పెట్టనివ్వరట. మన సభను అడ్డుకునేది ఎవ్వడు? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎవ్వడు అడ్డుకోవడానికి. నల్లగొండ ఆయన జాగీరా? ఎట్లా పెట్టుకోనివ్వరో చూద్దాం. ఇలాంటి వాళ్లను చాలామందిని చూసినం.  

ఈ ప్రభుత్వాన్ని మనం కూల్చాల్సిన అవసరం లేదు 
ప్రాజెక్టుల విషయంలో మన ఎమ్మేల్యేలు సభలో కొట్లాడతరు. మనం అందరం వెళ్లి నల్లగొండలో కొట్లాడుదాం. మనం ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి గడ్డపారలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. వాళ్లు ప్రకటించిన పథకాలు అమలు చేయలేక వాళ్లకు వాళ్లే కొట్టుకుంటారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తది.

ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా వెయ్యి శాతం మనమే అధికారంలోకి వస్తాం..’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ, సత్యవతి రాథోడ్‌ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్‌పీ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

నల్లగొండ సభను విజయవంతం చేయాలి 
తెలంగాణ భవన్‌లో సమావేశానంతరం నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ మరోసారి నాయకులతో సమావేశమయ్యారు. ఈ నెల 13న నల్లగొండలో బహిరంగసభ నిర్వహణపై ఉమ్మడి ఖమ్మం , మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలు సమన్వయ కర్తలతో చర్చించారు. ప్రాజెక్టుల అప్పగింతతో ఎదురయ్యే దుష్పరిణామాలు తెలంగాణ సమాజానికి తెలిసేలా ఈ సభను విజయవంతం చేయాలని సూచించారు.     

Advertisement
 
Advertisement