దేవాలయాలపై దాడుల వెనుక టీడీపీ కుట్ర

Botsa And Vellampalli Says That TDP conspiracy behind attacks on temples - Sakshi

త్వరలోనే ఆధారాలు బయటపెడతాం 

చంద్రబాబును ముద్దాయిగా నిలబెడతాం 

చంద్రబాబు, లోకేశ్‌లు.. నోరు అదుపులో ఉంచుకోవాలి 

నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం 

రామతీర్థంలో మంత్రులు బొత్స, వెలంపల్లి ఫైర్‌ 

ఆలయ పవిత్రతను కాపాడేందుకు పెద్దలందరితో చర్చించి నిర్ణయం 

సాక్షి ప్రతినిధి, విజయనగరం:  దేవాలయాలపై దాడుల వెనుక టీడీపీ కుట్ర ఉందని, ఇందుకు సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటపెడతామని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో ఆదివారం వారు పర్యటించారు. అక్కడి కోదండ రామస్వామి ఆలయంలో కొద్దిరోజుల కిందట రాముడి విగ్రహ శిరస్సును దుండగులు ధ్వంసం చేసి సీతమ్మ కొలనులో పడేసిన ఘటనపై పరిశీలనకు కాలినడకన వారు కొండపైకి వెళ్లారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. కొండ దిగువనున్న ప్రధాన ఆలయంలో సీతారామస్వామిని దర్శించున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, సీఎం వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

ఓర్వలేక నీచానికి ఒడిగడుతున్నారు.. 
సీఎం జగన్‌ సంక్షేమ పాలనను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి బొత్స విమర్శించారు. భగవంతుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక, ప్రజలతో ఛీత్కారానికి గురైన చంద్రబాబు ఇప్పుడు ఉక్రోషంతో సీఎంపై నీచంగా మాట్లాడుతుండడాన్ని జనం గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం పెద్ద కార్యక్రమం నిర్వహించే ముందు రోజో, ఆ తర్వాత రోజో టీడీపీ నేతలు గందరగోళాన్ని సృష్టించడం పరిపాటిగా మారిందన్నారు. రామతీర్థంలో జరిగిన ఘటనలో, రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల్లో చంద్రబాబు హస్తం ఉందని, అవన్నీ రుజువులతో బయటపెడతామని బొత్స స్పష్టం చేశారు. చంద్రాబాబును రాష్ట్రంలో ముద్దాయిగా నిలబెడతామని, జీవితంలో మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా చేస్తామని ఆ శ్రీరాముని సాక్షిగా చెబుతున్నామన్నారు. రోడ్ల విస్తరణ పేరుచెప్పి చంద్రబాబు కూల్చిన దేవాలయాలను పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రామతీర్థం దేవాలయానికి ట్రస్టీ చైర్మన్‌గా ఉన్న అశోక్‌గజపతిరాజుకు తన బాధ్యత ఎందుకు గుర్తుకు రాలేదని మంత్రి బొత్స నిలదీశారు. లోకేశ్‌ తన ట్విట్టర్‌లో వాడే భాష చూస్తుంటే బాధనిపిస్తోందని.. ఆయనొక లోఫర్‌ అని బొత్స తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీపై సదుద్దేశం ఉండేదని, వారు పుణ్యక్షేత్రంలో రాజకీయ నినాదాలు చేయడం, అసభ్యకరంగా మాట్లాడడం బాధాకరమన్నారు.  

చంద్రబాబు సంగతి అందరికీ తెలుసు 
మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. మనిషి వేషంలో ఉన్న మృగాలు మాత్రమే ఆలయాలపై దాడులకు పాల్పడతాయన్నారు. రాత్రివేళ సుమారు 40 దేవాలయాలను అడ్డగోలుగా కూల్చివేసిన చంద్రబాబు రామతీర్థం వచ్చి నీతి వాక్యాలు వల్లించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. రానున్న తిరుపతి ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చంద్రబాబు ఈ ఘటనలను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన  మండిపడ్డారు. కాళ్లకు బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకు హిందూ సంప్రదాయాలను పట్టించుకునే అలవాటు ఉందా అంటూ ప్రశ్నించారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆగమ శాస్త్రం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రంలోని పెద్దలందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల పరిరక్షణ దిశగానే పనిచేస్తోందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని వెలంపల్లి కోరారు. హిందూ బంధువులంతా సమన్వయంతో ఉంటూ ప్రతి గుడిని పరిరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top