బీజేపీ షోని డైవర్ట్ చేయడంలో కేసీఆర్ సఫలమేనా?

BJP Vijay Sankalp Sabha Is KCR Succeed To Turn Focus From Modi Meeting - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణరాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీపై యుద్దభేరీ మోగించారు. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఇంతగా మోదీని తూర్పారపట్టలేదు. తెలంగాణ మొదలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కేసిఆర్ పలు ప్రశ్నలు సంధించి, మోదీ హయాంలో దేశం పరువు పోతోందని రుజువు చేసే యత్నం చేశారు.
చదవండి: ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన ప్రధాని మోదీ! 'వెల్‌డన్‌' బండి సంజయ్‌

కేసీఆర్ తమ ప్రభుత్వం జోలికి వస్తే కేంద్రంలోని ప్రభుత్వాన్నే కూల్చుతామన్న ప్రకటన కొంత అతిశయోక్తిగానే ఉన్నా, కేసిఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ  సమాధానం ఇవ్వవలసి ఉంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్  కేసీఆర్‌కు సమాధానం ఇచ్చే యత్నం చేసినా, ప్రత్యారోపణలే చేశారు తప్ప, మోదీపై ఆరోపణలకు ఆయన సమాధానం ఇచ్చినట్లు కనిపించదు. కాకపోతే ఉఫ్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఊడిపోతుందని, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని సంజయ్ సవాల్ విసిరారు.

తెలంగాణ రాజకీయ తెరపైన టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడడానికి ఈ సమయాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగానే ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేస్తే, దానికి పోటీగా రాష్ట్రపతి విపక్ష అభ్యర్ది యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ వ్యూహాత్మంగా హైదరాబాద్ రప్పించింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బీజేపీ శ్రేణులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఘన స్వాగతం చెబుతూ తీసుకు రాగా, యశ్వంత్ సిన్హాకు స్వయంగా కేసీఆర్ స్వాగతం చెప్పడమే కాకుండా, పదివేల బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి వస్తే, కేసీఆర్ వెళ్లకుండా ప్రోటోకాల్ మంత్రిగా తలసాని శ్రీనివాస యాదవ్‌ను పంపించారు.

గత కొన్ని నెలలుగా మోదీ, కేసీఆర్‌ల మధ్య సాగుతున్న ప్రత్యక్ష, పరోక్ష యుద్దాలకు మరోసారి హైదరాబాద్ వేదిక అయింది. బీజేపీ వారు కేసీఆర్‌కు వ్యతిరేకంగా సాలు దొర అంటూ టైమ్‌ బోర్డు ఏర్పాటు చేస్తే, టీఆర్ఎస్ పేరున కాకపోయినా, సాలు మోదీ, సంపకు మోదీ అంటూ కొందరు బోర్డులు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి నగరం అంతా ఆ పార్టీ జెండాలు, తోరణాలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తే, వాటికి పోటీగా టీఆర్ఎస్ ప్రభుత్వం తన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెట్రో పిల్లర్‌లపైన, మీడియాలోను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కొన్ని చోట్ల మెట్రో పిల్లర్ల ప్రచారం వివాదం అయింది. కొందరు బిజెపి కార్యకర్తలు టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రచార ప్రకటనలపైనే మోడీకి స్వాగతం చెబుతూ విజయ్ సంకల్ప సభకు సంబంధించిన పోస్టర్లు అతికించారు. మధ్యలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద బీజేపీ, టిఆర్ఎస్ లు జెండాలు కడితే, కాంగ్రెస్ వారు వచ్చి అభ్యంతరం తెలిపారు.

అంతా సందడిగా కనిపిస్తున్నా, వీరంతా వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడుతున్న గేమ్ అని అర్థం చేసుకోవడం కష్టం కాదు. బీజేపీ సమావేశాలు పూర్తిగా హైలైట్ అవ్వకుండా, ప్రజల దృష్టి అంతా బీజేపీ వైపు వెళ్లకుండా చేయడంలో కేసీఆర్ కొంతమేర సఫలం అయ్యారు. ఎందుకంటే అన్ని మీడియాలలో బీజేపీ సమావేశాలతో పాటు, కేసిఆర్ ప్రసంగాన్ని కూడా ప్రముఖంగా కవర్ చేయక తప్పలేదు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ ఇలాంటి సమావేశాలు జరుపుకుంటుంటే, ఆ పార్టీకి సంబంధించిన వార్తలే అత్యధికంగా వస్తుంటాయి. కాని ఈసారి దానిని నిలువరించి, తన వంతు వాటాను కేసీఆర్ పొందగలిగారు. ఆయన మాట్లాడిన విషయాలు చూస్తే మోదీని ఢీకొట్టగల మగాడు కేసీఆర్ అని ప్రజలు భావించేలా కేసీఆర్ మాట్లాడగలిగారు. నిజానికి కేసీఆర్‌కు అంత బలం ఇంకా రాలేదు. ఆయనకు ఉన్న ఎమ్మెల్యేల బలం, ఎంపీల బలం బీజేపీ ముందు ఎందుకూ కొరవడదు. రాష్ట్రపతి ఎన్నికలలో వీరి ఓట్లు కొద్దిగా ఉపయోగమే తప్ప, సిన్హాను గెలిపించే స్థాయిలో ఉండవు.

అయితే యశ్వంత్ సిన్హా తన స్పీచ్‌లో కేసీఆర్ను ప్రశంసిస్తూ, దేశానికి ఇలాంటి నేతలు అవసరం అని చెప్పారు. ఆ రకంగా జాతీయ స్థాయిలో కేసీఆర్ ఫోకస్ అవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఆయన తీసుకున్నారని చెప్పవచ్చు. నిజానికి కేసీఆర్ తక్షణ లక్ష్యం జాతీయ రాజకీయాలు కాదు.. వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. వాటిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ తన గేమ్ తాను ఆడుతున్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీ తెలంగాణలో పుంజుకోవడానికి చేస్తున్న యత్నాలను ఆయన తగ్గించేలా వ్యవహరించారు. ఒక దశలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుదలను ఆయన కోరుకున్నా, భవిష్యత్తులో అది మరీ పెరిగిపోకుండాను, అలాగే బీజేపీని,మోదీని ఎదిరించే ధీరుడుగా తన ఇమేజీ పెంచుకోవడానికి కేసీఆర్ ఈ అవకాశాన్ని వాడుకున్నారు.

ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం అనుసరించిన అంతర్జాతీయ విధానాలను కూడా ఎత్తిచూపారు. శ్రీలంకలో అదాని విద్యుత్ ప్రాజెక్టు విషయంలో మోదీపై వచ్చిన ఆరోపణలు మొదలు, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి ఆ దేశంలో మోదీ, హౌడీ అంటూ సభలు జరపడం వరకు కేసీఆర్ ప్రస్తావించి దేశం పరువు తీశారని అన్నారు. అమెరికా వెళ్లి ట్రంప్ కోసం ప్రచారం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో మోదీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శలను  గుర్తు చూస్తూ, రూపాయి విలువ ఇప్పుడు ఎందుకు పడిపోయిందని అడగడం ఆసక్తికర విషయమే. నిజంగానే అప్పట్లో మోదీ రూపాయి విలువ పతనంపై తీవ్రంగా విమర్శలు కురిపించారు.

కానీ ఇప్పుడు అంతకన్నా ఘోరంగా రూపాయి విలువ తగ్గిపోయింది. దీనికి మోదీ సమాధానం ఇస్తారా అన్నది సంశయమే. జాతీయ స్థాయిలో తొమ్మిది ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని కేసీఆర్ వివరించారు. తాజాగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తీరును ఆయన ఆక్షేపించారు. ఈ విషయంలో కేసీఆర్ కూడా విమర్శలకు గురికాక తప్పదు. గత ఎన్నికలలో వేరే పార్టీల నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్న తీరు కూడా సమర్దించదగినది కాదు. నోట్ల రద్దు వంటి విషయాలను కూడా కేసీఆర్ చెప్పినా, అప్పట్లో ఈయన కూడా వాటికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోరు కదా. ఇక బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ దమ్ముంటే కేంద్రంలోని తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్ చేశారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉఫ్ అంటే పడిపోతుందని అన్నారు. అంటే వచ్చే ఎన్నికల వరకు బీజేపీ ఆగుతుందా?లేక ఈలోగానే ఏమైనా చేస్తుందా అన్న సందేహానికి ఆస్కారం ఇచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏమీ చేయలేరు. అలాగే  తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ ఏమీ చేయలేదు. ఈ రెండు పార్టీలు వాదోపవాదాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ పానకంలో పుడకలా మరోసారి తమ గొడవలతో రచ్చకెక్కింది. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాకను పురస్కరించుకుని కాంగ్రెస్ వారు ఎవరూ స్వాగతానికి వెళ్లరాదని, అదంతా టీఆర్ఎస్ కార్యక్రమంగా సాగుతున్నందున దాని జోలికి పోరాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కానీ సీనియర్ నేత వి.హనుమంతరావు వాటిని పట్టించుకోకుండా వెళ్లి సిన్హాకు టీఆర్ఎస్ వారితో కలిసి స్వాగతం చెప్పారు.

దానిపై రేవంత్ మండిపడి, పార్టీ నిర్ణయాలను దిక్కరిస్తే బండకేసి కొడతానని హెచ్చరించారు. దీనిపై మరో నేత జగ్గారెడ్డి స్పందిస్తూ రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.  ఢిల్లీలో రాహుల్ గాంధీ పక్కన కేటిఆర్ ఉండగా లేని తప్పు వి.హెచ్ స్వాగతం పలికితే వచ్చిందా అన్న మౌలిక ప్రశ్నను లేవనెత్తారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు ఇలాంటి సమస్యలు తప్పవు. మొత్తం మీద కేసీఆర్ వ్యూహాత్మకంగా తెలంగాణ రాజకీయం తన చుట్టూరానే తిరిగేలా చేసుకోవడం వరకు సఫలం అయ్యారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య టీఆర్ఎస్ సునాయాసంగా గెలవడానికి ఆయన అమలు చేస్తున్న వ్యూహాలలో భాగంగానే ఈ హడావుడి జరిగినట్లు అనిపిస్తుంది. మొత్తం మీద షో మొత్తం బీజేపిది కాకుండా, టీఆర్ఎస్ వైపు కూడా మీడియా, ప్రజలు చూసేలా చేయడం వరకు కేసిఆర్ సక్సెస్ అయినట్లే.

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top