
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో వీకే సక్సెనా తరచూ తమ పరిపాలనకు అడ్డు తగులుతున్నాసరే విజయవంతంగా ప్రభుత్వపాలన కొనసాగించినందుకుగాను తాను కూడా నోబెల్ బహుమతికి అర్హుడినేనని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అవినీతి, అసమర్థత కేటగిరిలో నోబెల్ ఉంటే కేజ్రీవాల్‌కు అవార్డు వచ్చేందని బీజేపీ నేతలు సెటైర్లు వేశారు.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నోబెల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. అసమర్థత, అరాచకం, అవినీతికి సంబంధించిన కేటగిరిలో నోబెల్ ఉండి ఉంటే.. ఆయనకు ఖచ్చితంగా ఒక అవార్డు లభించేది అని కౌంటరిచ్చారు. ఇదే సమయంలో ఆప్ పాలనలో జరిగిన అక్రమాలను ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సులలో పానిక్ బటన్లు, తరగతి గది నిర్మాణం, మహిళలకు పెన్షన్ పథకాలు, మద్యం లైసెన్సింగ్, షీష్ మహల్ గురించి వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. బీజేపీ నేత వ్యాఖ్యలకు ఆప్ నేతలు తిరిగి కౌంటరిచ్చారు. సచ్‌దేవా వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ..‘వీరేంద్ర సచ్‌దేవా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. కేవలం మాట్లాడటం కాదు. పరిపాలన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతిపక్షాల రోజులు ముగిశాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పండి. ఆప్ హయాంలో పాఠశాలలు నిర్మించాం. ఆసుపత్రుల్లో వసతులను మెరుచుపరిచాం. ఉచిత విద్యుత్ ఇచ్చాం. అవినీతిని అరికట్టాం. కానీ, బీజేపీ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. మంత్రులే దోచుకుంటున్నారు’ అని ఆరోపించారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా.. అంతకుముందు పంజాబ్‌లోని మొహాలిలో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘మా ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉన్నంత కాలం పని చేయడానికి అనుమతించనప్పటికీ మేం పనిచేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఢిల్లీలో చేసిన పనులు, పరిపాలనకు నోబెల్ బహుమతి పొందాలని నేను భావిస్తున్నాను. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అరవింద్ కేజ్రీవాల్ మడిపడ్దారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆప్ పథకాలు గాడితప్పేలా వ్యవహరించారని విమర్శించారు. ‘ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌లను ఆప్ నిర్మించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులు తమ బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్‌కు బుల్డోజర్లను పంపి ఐదు మొహల్లా క్లినిక్‌లను కూల్చివేశారు. వారికి ఏం లభించింది? మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ప్రభుత్వ మొహల్లా క్లినిక్‌లను కూల్చివేసింది’ అని అన్నారు.
మరోవైపు దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లో ఢిల్లీలో పరిస్థితి దిగజారిందని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మొహల్లా క్లినిక్‌లను మూసివేశారని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల ఉచిత నీరును తమ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ పథకాలు గాడితప్పడంతో ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రాముఖ్యతను గ్రహిస్తున్నారని అన్నారు.