
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం మాత్రం శూన్యమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
38వ సారి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. త్వరలో సెంచరీ కొడతారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పట్టు సాధించకపోవడంతో పాలనపడకేసింది. కేబినెట్ విస్తరణ చేయలేక, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేసుకోలేక పోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగిన ప్రజలు.. మార్పు కోరున్నా అనే దానికి ఈ ఫలితాలు సంకేతం. అలవికాని హామీలు ఇచ్చి, అమలు చేయలేక బిక్క చూపులు చూస్తున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ డబ్బులు చెల్లించలేకపోతున్నారు. సీఎం స్వయంగా నాలుగు బహిరంగ సభలు పెట్టినా ఫలితం శూన్యం. రేవంత్ 14 నెలల పాలనకు ఇది రెఫరెండంగా భావించాలి. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యింది’అని ఆరోపించారు.