సీఎం పీఠం నితీష్‌కు దక్కుతుందా?

BJP Leading In Bihar Assembly Elections - Sakshi

 విజయం దిశగా దూసుకుపోతున్న ఎన్డీయే కూటమి

పట్నా : దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తించిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఇక అధికారంపై ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి తీవ్రమైన పోటీ ఇచ్చినప్పటికీ పలు చోట్లో ఎన్డీయే కూటమిని ఎదుర్కోలేకపోయింది. మొత్తానికి పట్నా పోరులో మరోసారి బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఎన్డీయే కూటమి ఊహించని విధంగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోనే జేడీయూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. (బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్‌ అప్‌డేట్స్‌)

చాణిక్యుడిగా పేరొందిన నితీష్‌కు ఈసారి బిహార్‌ ఓటర్లు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు అర్థమవుతోంది. అయితే కేంద్రంలోని బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానియా బాగానే పనిచేసింది. అంచనాలకు అందకుండా ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అనుహ్యమైన ఫలితాలను సాధించింది. ప్రస్తుతం వెల్లడైన ఫలితాల ప్రకారం.. బిహార్‌ అసెంబ్లీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం.. ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో ముందంజలో ఉండగా.. వాటిల్లో బీజేపీ 75కు పైగా సీట్లులో ఆధిక్యంలో ఉంది.  జేడీయూ 50 సీట్లకు మాత్రమే పరిమితమైంది.

అయితే అనుహ్య రీతిలో బీజేపీ పుంజుకోవడం బిహార్‌ ఎన్నికల్లో ఎవరూ ఊహించలేనిది. అయితే ఫలితాల అనంతరం ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీష్‌ కుమార్‌గా ఎన్నికయ్యారు. అయితే ఫలితాలు తారుమారు కావడంతో పాటు బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో అతిపెద్ద పార్టీ అయిన తమకే సీఎం పీఠం దక్కాలని కాషాయ నేతలు డిమాండ్‌ చేసే అవకాశం లేకపోలేదు. దీనిపై జేడీయూ నేతలు మాట్లాడుతూ... ముందు జరిగిన ఒప్పందం ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా.. నితీష్‌ కుమార్‌నే సీఎంగా ఎన్నుకుంటామని తెలిపారు. అయితే ఫలితాల అనంతరం జరిగే పరిణామాలు బట్టి బీజేపీ వ్యూహం మార్చుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top