
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నమ్మితే నట్టేట ముంచారు. భావి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా, ద్రోహం తలపెట్టారు. టీడీపీతో అంతర్గతంగా చేతులు కలిపి, వెన్నుపోటు పొడిచారు..’ ఇవి తాజాగా బీజేపీ నేతల మాటలు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసైనికుల ఓట్లు బీజేపీకి పడలేదనే ఆక్రోశాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మద్ద తిచ్చినట్లే ఇచ్చి అంతర్గతంగా చంద్రబాబుతో చేతులు కలిపారంటూ.. జనసేనానిపై కాషాయ దళం కత్తులు నూరుతోంది. గెలుపు దేవుడెరుగు మర్యాద నిలుపుకొనే రీతిలో కూడా ఓట్లు దక్కలే దన్న ఆవేదన వారిని వెంటాడుతోంది.
తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఆ పార్టీ నేతల దృష్టి తిరుపతి ఉప ఎన్నికలపై పడింది. జనసేన దోస్తీ, మాజీ ఐఏఎస్ అధికారిణి అభ్యర్థి.. ఇక విజయం తమదే.. అన్న రీతిలో వ్యవహరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తీరా ఫలితాలు చూస్తే, 50,080 ఓట్లతో (5 శాతం) సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితాల అనంతరం చర్చించుకున్న నేతలు.. జనసేనాని ఏమాత్రం సహ కరించలేదని, నోటితో మాట్లాడుతూ.. నొసటితో వెక్కిరించే చర్యలకు పాల్పడ్డారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం చేశారంటూ బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
చంద్రబాబు.. పవన్ ఒప్పందమా?
తిరుపతి ఉప ఎన్నికల్లో తనను తమ్ముడు పవన్‌కల్యాణ్ గెలిపిస్తారని బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ బాహాటంగా ప్రకటించారు. వారం రోజులపాటు పవన్‌కల్యాణ్ ప్రచారం చేస్తారని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పారు. దీంతో అభ్యర్థి రత్నప్రభ ఆశలు చిగురించాయి. తీరా పవన్‌కల్యాణ్ ఒక్కరోజు ప్రచారానికే పరిమితమయ్యారు. చంద్రబాబుతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పవన్‌కల్యాణ్ వారం రోజులు ప్రచారానికి దూరంగా ఉండిపోయారని, తమకు వెన్నుపోటు పొడిచారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 2019లో జనసేన అభ్యర్థికి 12,315 ఓట్లు దక్కాయని, 2021 ఉప ఎన్నికలల్లో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభకు 11,598 ఓట్లు మాత్రమే లభించాయని గుర్తుచేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్‌ధర్ వంటి నేతలు పడిగాపులు కాస్తూ వకీల్‌సాబ్ సినిమా చూశారని, తద్వారా సినిమాకు ప్రచారం చేయించుకుని లబ్ధిపొందారని విమర్శి స్తున్నారు.
తిరుపతి పార్లమెంటు పరిధిలో నాయ కత్వాన్ని కాదని, సంబంధం లేని ఆదినారాయణ రెడ్డి వంటి నేతలకు పెత్తనం ఇవ్వడం కూడా తప్పిదమేనని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటు న్నారు. తిరుపతి ఓటమిపై చర్చించి, రాష్ట్ర నాయకత్వాన్ని ప్రక్షాళన చేయాలని వారు కేంద్ర నాయకత్వాన్ని కోరినట్లు సమాచారం. మరోవైపు అసలు బీజేపీకి ఓట్లేలేవని, తిరుపతిలో లభించిన ఓట్లన్నీ తమవేనని జనసేన నేతలు చెబుతుండటం కొసమెరుపు.