
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 27న సూర్యాపేటలో నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభకు హాజరుకానున్నారు. సభ ముగిశాక నగరంలో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్న నేతలను అమిత్‌షా ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడనున్నట్టు తెలిసింది.
అప్పటికి అభ్యర్థుల రెండోజాబితా కూడా వెలువడే అవకాశాలున్నందున 28వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించడం, ప్రస్తావించాల్సిన విషయాలు, ప్రచార శైలి తదితర అంశాలపై ఆయన స్పష్టతనివ్వనున్నట్టు తెలుస్తోంది. పార్టీపరంగా అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని కూడా ఈ నెల 28 నుంచి ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సూచనలు చేయనున్నారు.
కాగా, 28, 29 తేదీల్లో ఎన్నికల ప్రచారానికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, 31న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రానికి రానున్నారు. అయితే వారు పాల్గొనే ప్రచార సభ లు, రోడ్‌షోలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.