పేపర్‌ లీకేజీపై బీజేపీ కీలక నిర్ణయం.. జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్లాన్‌..

BJP Key Decision On TSPSC Paper Leak - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. పరీక్షలు రాసిన అభ్యర్థుల వద్దకెళ్లడం, యూనివర్సిటీల సందర్శన, లీకేజీ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ వంటివి చేపట్టే దిశగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. వివిధ రూపాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా లీకేజీ వ్యవహారంపై ప్రజా స్పందనను తెలుసుకునే యత్నం చేయనుంది. ఇందులో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగ యువతను, వారి తల్లితండ్రుల దృష్టిని ఆకర్షించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది.

ఇప్పటికే లీకేజీ పరిణామాలపై రాష్ట్ర పార్టీ, బీజేవైఎం, ఇతర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలతో వివిధ వర్గాల ప్రజల్లో మంచి మైలేజీ వచ్చిందనే అంచనాల్లో పార్టీ నాయకత్వముంది. పేపర్‌ లీకేజీ వ్యవహారంతో పాటు ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత విచారణ, తదితర పరిణామాలపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రులు, అధికారపార్టీ నేతల వ్యవహారశైలిని ఎండగట్టేలా నిరసన, ఆందోళన కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని భావిస్తోంది.

ఆ విషయంలో మనమే ముందున్నాం 
పేపర్‌ లీకేజీ అంశంపై టీఎస్‌పీఎస్‌సీ పర్యవేక్షణ, నిర్వహణా వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో తాము ముందున్నామనే అభిప్రాయంతో బీజేపీ ముఖ్యనాయకులున్నారు. కాంగ్రెస్‌తో సహా ఇతర రాజకీయ పార్టీల కంటే ముందుగా ఈ అంశాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లి చర్చనీయాంశం చేయడంలో సక్సెస్‌ అయ్యామని బీజేపీ ముఖ్యనేత వ్యాఖ్యానించారు.

టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల నిర్వహణ తీరు, లోటుపాట్లను ఎత్తిచూపి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి బీజేపీకి అనుకూలంగా ప్రజా మద్దతును కూడగట్టగలిగామనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ముందువరసలో నిలవగలిగామని ఆ నేత అభిప్రాయపడ్డారు. ఇదే ఊపుతో పేపర్‌ లీకేజీతో పాటు ఢిల్లీ లిక్కర్‌స్కాంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, నేతల వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణను సిద్ధం చేయనున్నట్టు వెల్లడించారు.
చదవండి: కొలువుల కలవరం

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top