సచివాలయానికి అంబేడ్కర్‌ పేరుపెట్టండి

BJP Chief Bandi Sanjay Slams On CM KCR Over New Secretariat Building - Sakshi

ఆ తర్వాతే పార్లమెంటు భవన్‌ పేరు మార్పు గురించి మాట్లాడండి... 

రాష్ట్ర ప్రభుత్వానికి బండి డిమాండ్‌.. ఈటల సస్పెన్షన్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటాం

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: తుది దశకు చేరుకున్న కొత్త సచివాలయ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే మంత్రి కేటీఆర్‌ పార్లమెంట్‌ భవన్‌ పేరు మార్పు గురించి మాట్లాడాలని సూచించారు. అసెంబ్లీలో అంబేడ్కర్‌ ఫొటో తీసేసి సీఎం కేసీఆర్‌ తన ఫొటో పెట్టించుకున్న విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో బండి సంజయ్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు.

సభలో సీఎం రాజకీయాలా?
ప్రధాని మోదీపట్ల సీఎం కేసీఆర్‌ సంస్కారహీనంగా మాట్లాడారని.. అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ప్రజాసమస్యలు, రాష్ట్ర పరిస్థితులపై చర్చించాల్సిన శాసనసభలో సీఎం కేసీఆర్‌ రాజకీయాలు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అసెంబ్లీని నడిపే అర్హత లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఎమ్మెల్యేలు ఎండగడుతున్నందుకే ఒక ఎమ్మెల్యేను (రాజాసింగ్‌) జైలుకు పంపించారని... ఇప్పుడు మరో ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్‌ చేశారని సంజయ్‌ దుయ్యపట్టారు.

మోదీని ఫాసిస్టు అన్నందుకు మాకెంత కోపం రావాలి..
అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్‌ చేయడాన్ని బండి సంజయ్‌ తప్పుబట్టారు. ఈటల సస్పెన్షన్‌ను ఖండిస్తున్నానని, ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని బండి తెలిపారు. అసెంబ్లీ బయట స్పీకర్‌ను మరమనిషి అని ఈటల విమర్శించినందుకే అధికార పార్టీ సభ్యులకు అంత కోపం వస్తే... నిండు సభలో ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ ఫాసిస్టు ప్రధాని అన్నందుకు తమకు ఎంత కోపం రావాలన్నారు. హామీలను అమలు చేయలేని వాళ్లను మరమనిషి అనడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు.

వీఆర్‌ఏలను బర్ల లెక్క కొట్టారు..
అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 50 రోజులుగా సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలు ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని బర్ల లెక్క కొట్టి తీసుకెళ్లారని బండి సంజయ్‌ మండిపడ్డారు. ప్రగతి భవన్‌ సందర్శకుల జాబితాలో ఒవైసీ సోదరులు తప్ప ఇతరుల పేర్లేవీ కనిపించవని.. ఇంకెవరినీ లోనికి రానీయరని విమర్శించారు. దమ్ముంటే ఆ జాబితాను బయట పెట్టాలన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top