ఎన్డీయే నుంచి వైదొలుగుతాం..

BJP Ally RLP Threatens To Quit Coalition Over Farm Laws - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు దేశ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలకు దారితీస్తోంది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే గడిచిన ఐదు రోజులుగా దేశ రాజధానిలో ఆందోళన చేపడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ వర్గాలకు అనుకూలంగా రూపొందించిన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, రాజస్తాన్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్స్‌కు కేంద్రం దిగొచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. (చర్చలకు రండి; కేంద్ర సర్కారు ఆహ్వానం)

రైతుల దీక్షకు దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు నూతన వ్యవసాయ బిల్లులు ఎన్డీయేలో చిచ్చుపెడుతున్నాయి. ఇప్పటికే ఆయా బిల్లులను వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్‌ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. పంజాబ్‌ రైతాంగానికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ హర్‌సిమ్రాత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా సైతం సమర్పించారు. బిల్లులపై పార్లమెంట్‌లో చర్చసాగుతున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుని రైతులు మద్దతుగా నిలుచున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులు వ్యతిరేక విధానాలను నిరశిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా మరోసారి రైతుల నిరసన దేశ రాజధానికి తగలడంతో మరో భాగస్వామ్యపక్షం బీజేపీకి హెచ్చరికలు జారీచేసింది. (బీజేపీ షాక్‌: రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!)

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించపోతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగతామని రాజస్తాన్‌కు చెందిన బీజేపీ మిత్రపక్షం లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్‌పీ) అధ్యక్షుడు హనుమాన్‌ బేనివాల్‌ ప్రకటించారు. దేశ రాజధాని నడిబొడ్డున చలిలో వేలాది రైతులు దీక్షలు నిర్వహిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోడం దారుణమన్నారు. ఈ మేరకు కేం‍ద్రహోంమంత్రి అమిత్‌ షాకు సోమవారం బేనివాల్‌ లేఖ రాశారు. రైతుల డిమాండ్స్‌కు వెంటనే స్పందించి కేంద్ర ఓ నిర్ణయానికి రావాలని డిమాండ్‌ చేశారు. కాగా రాజస్తాన్‌లో బలమైన సామాజిక వర్గం మద్దతుదారులను కలిగిఉన్న ఆర్‌ఎల్‌పీ ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో దాదాపు 15 పార్లమెంట్‌ స్థానాల్లో ప్రభాల్యం కలిగిన బేనివాల్‌.. తాజాగా రైతు దీక్షకు మద్దతు ప్రకటించారు.

కాగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో గత ఐదు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతు సంఘాల నేతలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం తమతో చర్చలకు ముందుకు రావాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సోమవారం రాత్రి ప్రకటించారు. రైతు సంఘాలు పోరాటం ఇక్కడితో ఆపాలని, చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతుండడం, చలి సైతం తీవ్రమవుతుండడంతో రెండు రోజుల ముందే చర్చలు సాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top